ఇవాంకాకు ఘన స్వాగతం పలికిన మంత్రులు, అధికారులు
హైదరాబాద్ జనంసాక్షి:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారురాలు, ఆయన గారాలపట్టి కూడా ఐన ఇవాంక ట్రంప్ హైదరాబాద్ గడ్డపై అడుగిడింది. తెల్లవారుజామున 3.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇవాంకాకు మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఇవాంక హోటల్ ట్రైడెంట్‌లో బస చేసేందుకు వెళ్లారు. రెండు రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా.. ఇవాంక ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుతోపాటు పలు ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఈ రెండు రోజులూ ఆమె హోటల్ ట్రైడెంట్ లో బస చేసే అవకాశం ఉంది. ఐతే తొలుత వెస్ట్ ఇన్ హోటల్ లో ఆమె స్టే చేస్తారని ప్రచారం జరిగినా.. చివరి నిమిషంలో హోటల్ ట్రైడెంట్ కు మార్చినట్టు సమాచారం. భద్రతా కారణాల దృష్ట్యా.. ఇవాంక ట్రంప్ బస చేసే స్థలాన్ని మార్చినట్టు తెలుస్తోంది.
ఇక మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు ఇవాంక ట్రంప్ ట్రైడెంట్ హోటల్ నుంచి హెచ్ఐసీసీకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు హెచ్ఐసీసీకి చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్‌తో కలిసి గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి హోటల్ ట్రైడెంట్‌కు వెళ్తారు. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు హోటల్ నుంచి రోడ్డు మార్గంలో ఫలక్ నుమా ప్యాలెస్ కు ప్రయాణమవుతారు. విందు అనంతరం రాత్రి 10 గంటలకు ఫలక్ నుమా నుంచి బయల్దేరి 10.45కి హోటల్ ట్రైడెంట్ కు చేరుకుంటారు.
ఇక బుధవారం ఇవాంక ట్రంప్ ఉదయం 9 గంటల 50 నిమిషాలకు హోటల్ ట్రైడెంట్ నుంచి బయలుదేరి.. ఉదయం 10 గంటలకు హెచ్ఐసీసీకి చేరుకుంటారు. ప్యానల్ చర్చలో పాల్గొంటారు. ఆ తర్వాత ఎగ్జిబిషన్ ను తిలకిస్తారు. పలు కార్యక్రమాలకు హాజరైన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు హెచ్ఐసీసీ నుంచి ట్రైడెంట్ హోటల్‌కు వెళ్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత హోటల్లోనే మహిళా పారిశ్రామికవేత్తలతో ఆమె సమావేశం అవుతారు. సాయంత్రం 5 గంటల 35 నిముషాలకు ట్రైడెంట్ హోటల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరుతారు. రాత్రి 9 గంటల 20 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు.హైదరాబాద్ టూర్లో ఇవాంకకు 18 గంటల పాటు ఖాళీ సమయం దొరకనుంది. ఆ టైంలో ఆమె నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది.





