జై తెలంగాణ 10 జిల్లాల తెలంగాణే
పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్
జీహెచ్‌ఎంసీ పరిధి మాత్రమే ఉమ్మడి
సీడబ్ల్యుసీ తీర్మానం, కేబినెట్ నిర్ణయాల మేరకే ప్రత్యేక రాష్ట్రం
రెండు రోజుల్లో రాష్ట్రపతికి
శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు
ఉమ్మడి పరిధిలోని ప్రజల రక్షణపై తెలంగాణ గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు
రెండు రాష్ట్రాల్లో ఆర్టికల్ 371(డి) కొనసాగింపు
పోలవరానికి జాతీయ హోదా
రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర సాయం
సీమాంధ్ర రాజధానికి నిపుణుల సెర్చ్ కమిటీ
45 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని గుర్తింపు
కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే
న్యూఢిల్లీ, డిసెంబరు 5 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం జైకొట్టింది. ఆరు దశాబ్దాల ప్రజల ఆకాంక్ష, నాలుగు దశాబ్దాల పోరాటాన్ని గౌరవించింది. హైదరాబాద్, పది జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్‌పై కొద్దిపాటి కొర్రీలు పెట్టినా సీమాంధ్రుల బెదిరింపులను గొంతెమ్మ కోర్కెలను మాత్రం పట్టించుకోలేదు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఇక్కడి ప్రజల రక్షణపై తెలంగాణ గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు ఉంటాయని కేంద్రం పేర్కొంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ విభజనపై చర్చించేందుకు గురువారం సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం మూడు గంటలకు పైగా చర్చించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం, కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకు పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు-2013కు కేంద్రం మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని, ఇందుకు సంబంధించిన ముసాయిదాను రెండు రోజుల్లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపిస్తామని తెలిపారు. ఆయన దానిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయాన్ని కోరుతారని, నిర్ణీత వ్యవధిలోగా అసెంబ్లీ అభిప్రాయం చెప్పగానే బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకువస్తామని అన్నారు. శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తుందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఆర్టికల్ 371(డి) కొనసాగిస్తామని, దీనిద్వారా విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థానికత వర్తిస్తుందని పేర్కొన్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ విభజనపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఈ అంశంపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి నివేదిక సమర్పించిందని అన్నారు. 18 వేల ఈమెయిల్స్‌ను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇరు ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులు, గుర్తింపుపొందిన రాజకీయ పార్టీలతో 11 అంశాలపై విస్తృతమైన సంప్రదింపులు జరిపి ముసాయిదా రూపొందించిందని చెప్పారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సాయమందిస్తుందని, సీమాంధ్ర భూభాగం 13 జిల్లాలతో ఏర్పడే ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి భారీ ప్యాకేజీతో పాటు సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని గుర్తింపునకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామని, 45 రోజుల్లోగా కమిటీ సీమాంధ్ర ప్రాంతాన్ని సందర్శించి రాజధానికి అనువైన ప్రాంతాన్ని గుర్తిస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పారు. దానిని పూర్తి చేయించే బాధ్యత కేంద్రమే తీసుకుంటుందని పేర్కొన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఏర్పాటు బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ జూలై 31న తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరుతూ విన్నవించగా, అక్టోబర్ 3న దీనిపై సంప్రదింపుల కోసం కేంద్రం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసిందని షిండే చెప్పారు. మంత్రుల బృందం 11 అంశాలపై ప్రజలు, పార్టీలు, మంత్రులు తదితర అభిప్రాయాలు సేకరించిందని చెప్పారు. జీవోఎం ప్రతిపాదనల మేరకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని అన్నారు.