ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిట్టచివరి అసెంబ్లీ సమావేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. 2014 ఎన్నికల నేపథ్యంలో ఆరు నెలల పాటు ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఈ సమావేశాల్లో ప్రవేశపెడతారు. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. 10న మంత్రివర్గం భేటీ అవుతుంది. అనంతరం ఓటాన్ అకౌంట్ ఆమోదం కోసం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. 10.08 నిమిషాలకు ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టనున్నారు. 11వ తేదీ సెలవు అనంతరం 12, 13వ తేదీల్లో సభ్యులు బడ్జెట్‌పై చర్చిస్తారు. గతనెల30 వరకు ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ అంశం తీవ్ర గందరగోళానికి దారి తీసిన సంగతి తెలిసిందే. టి బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఎల్లుండి నిర్వహించబోయే అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాలి. అయితే అసెంబ్లీ ఓటాన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కావడంతో పెద్దగా ఇతర అంశాలకు ప్రాధాన్యం ఉండకపోవచ్చు. ఓటాన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను మంత్రి రాం నారాయణ రెడ్డి సోమవారం అసెంబ్లీ ప్రవేశపెట్టనున్నారు. అయితే మంగళవారం మాత్రం అసెంబ్లీకి సెలవు. ఈ మేరకు ముఖ్యమంత్రి సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రి ఆనం భేటీ అయ్యారు. సమావేశాలను నాలుగు రోజులపాటు జరపాలని సూతప్రాయంగా నిర్ణయించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ఆమోదం కోసం ఏర్పాటు చేసే అసెంబ్లీ సమావేశాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం కొందరు మంత్రులతో చర్చించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం, ఆ తరువాతి పరిణామాలను అనుసరించి అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టనున్నారు.





