జనసంద్రం కానున్న మేడారం
వరంగల్, ఫిబ్రవరి 8 (జనంసాక్షి) :
తెలంగాణ కుంభమేళా.. ఆడబిడ్డల జాతరకు సర్వం సన్నద్ధమయ్యింది. తల్లులను దర్శించుకునేందుకు ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి 20 లక్షల మందికిపైగా భక్తులు తరలిరాగా.. మేడారం కీకారణ్యం ఇక జనారణ్యం కాబోతుంది. నిండు పౌర్ణమి కోసం మేడారం ఎదురు చూస్తోంది.. ఈ నెల 14న పౌర్ణమి అన్న విషయం తెలిసిందే. మేడారం జాతర ఈ నెల 12నుండి ప్రారంభమై 15వ తేదీతో ముగియనున్నది. జాతర ప్రధాన ఘట్టానికి తెరలేవలేదు. అయితే గత వారం రోజుల నుండి జనజాతర ఆరంభమైంది. మొక్కులు తీర్చు కుంటున్నారు. శుక్రవారం నాటికి సుమారు 20లక్షలమందికి పైగా భక్తులు సమ్మక్క-సారాలమ్మలను దర్శించుకుని వెనుదిరిగినట్టు సమాచారం. శనివారంఉదయం కూడా జంపన్నవాగు భక్తులతో సందడి సందడిగా ఉంది. ‘బంగారం’ (బెల్లం) సమర్పించుకుంటున్నారు. తాడ్వాయి అటవీ ప్రాంతంలోని కుగ్రామమైన మేడారం ప్రస్తుతం భక్తజనంతో కళకళలాడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లను కేటాయించింది. భక్తుల రాకపోకల కోసం ప్రత్యేక బస్టాండును ఏర్పాటు చేశారు. వరంగల్లోని 8 డిపోల నుండి, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ నుండి ప్రత్యేక బస్సులను కలుపుకుని మొత్తం 3,200బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది. 12న సారాలమ్మ.. 13..సమ్మక్క.. 14న మొక్కులు చెల్లింపు.. 15న ఆడబిడ్డల వన ప్రవేశంతో జాతర ముగియనున్నది.
జాతర ఇలా..
ఆదివాసిల్లోని నాయకపోడ్ గిరిజన తెగల ఆరాధ్య దైవమైన ములుగు గట్టమ్మ తల్లి నుండి మేడారం జాతర సందడి మొదలవుతుంది. తల్లుల గద్దెలకు చేరేంతవరకు అనేక ఊళ్లు, వాగులు, వనాలు దాటుకుంటూ ప్రయాణం సాగుతుంది. ముందుగా గట్టమ్మపల్లి దాటగానే ములుగు గ్రామం వస్తుంది. మేడివాగు తామర ఆకులతో స్వాగతం పలుకుతుంది. జంగాలపల్లికి చేరుకుంటుంది. రామస్వామి గుట్ట మూల మలుపును తాకుతూ తల్లి చిన్నగుట్టమ్మ వస్తుంది. చిన్నగుట్టమ్మతల్లికి పసుపు,కుంకుమ సమర్పించుకుంటారు. గట్టమ్మ దిగువున ఉన్న ఈర్లవాగు దాటుకుని గండికుంటపల్లె దాటి సుద్దవాగును తాకుతుంది. మచ్చాపురం చేరుకుంటుంది. గోవిందరావుపేట దాటి పస్రా వద్ద మలుపు తిరుగుతుంది. దయ్యాలవాగు చేరుకుంటుంది. పూనకాల కోలాహలం సాగుతుంది. ఆ తరువాత కొండపర్తి జంక్షన్, నేరేడుచెట్ల గుబుర్లతో చల్లిని ప్రదేశం..ఇక తల్లుల పేరున్న తాడ్వాయి (సమ్మక్క-సారాలమ్మ) మండల కేంద్రం. ఏదేమైనా భక్తజనులను తొలుత పలుకరించేంది జంపన్నవాగు. జంన్నవాగులో, జాలరి మడుగుల్లో పాదం మోపితేనే మోక్షమని తల్లుల దర్శనానికి ముందు తనయుడ్ని తాకడం ఆనవాయితి. లక్నవరం సరస్సు నుండి వచ్చే జలాలలో జంపన్నవాగు ఆహ్లాదభరితంగా ఉంటుంది. జంపన్నవాగుకు ఉత్తరం వైపున సారాలమ్మ తల్లి కొలువైన కన్నెపల్లి. సమ్మక్కకొలువైన చిలుకలగుట్ట దర్శనం నయనానందకరంగా ఉంటుంది.ఇదిలా ఉండగా ఏటూరునాగారం మండలం చిలకలగుట్ట నుండి రెండు జలధారలు..ఒకటి పూర్వ కాలం నుండే ఉంది. మరొకటి ఏడాదినుండి వస్తోంది. వీటిని వనదేవతలుగానే విశ్వసిస్తున్నారు. తరతరాలుగా ఉన్న జలధారను సమ్మక్క అని.. మరోదానిని సారాలమ్మ అని పిలుస్తారు. చిలకలగుట్టనుండి వచ్చే జలం సమ్మక్కసన్నిధినుండి వస్తుందని విశ్వాసం.
1982 వరకు ఇలా..
జాతరలో అమ్మవార్ల గద్దెలకు పసుపు రాసి.. కుంకుమ బొట్లతో పూజించే సంప్రదాయం ఉండేది. గద్దెలపై ఇప్పపూల వంటి పూలతో అమ్మవారి గద్దెను అలంకరించేవారు. 1982వరకు ఆ సంపద్రాయం కొనసాగింది. ఆ తరువాత నుండి గద్దెలకు పసుపు పెయింటింగ్ పూసి, వాటిపై మల్లె, తదితర పుష్పాలను ఉంచుతున్నారని కొందరు భక్తులు అంటున్నారు.
విశేషాంశాలు..
– 1996లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది
– ప్రతి రెండేళ్లకు మాఘ శుద్ధ పౌర్ణమినాడు సమ్మక్క జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది
– మేడారం జాతర దృష్ట్యా సుమారు తొమ్మిదివేల మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు.
– పస్రా నుంచి తాడ్వాయి వెళ్లే మార్గం సింగిల్రోడ్డు కావడంతో జాగ్రత్తలు తీసుకున్నారు
– బారికేడ్లు, సైనుబోర్డులు ఏర్పాటు చేశారు
– సుమారు కోటి మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో జిల్లా కలెక్టర్ నుంచి అటెండర్ వరకు మేడారంలో మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.





