Monday, 2 November 2026

తమిళనాడు రాజకీయం కీలక మలుపు

చెన్నై: తమిళనాడు రాజకీయం కీలక మలుపు తిరిగింది. అధికార పార్టీ అన్నా డీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ప్రస్తుత సీఎం పన్నీర్‌ సెల్వం అధ్యక్షతన జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో శశికళను పార్టీ శాసనసభాపక్ష నేతగా ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అంతా హర్షధ్వానాలతో ఆమోదం తెలిపారు. దీంతో అన్నా డీఎంకే శాసనసభాపక్షనేతగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని తమిళనాడు ఇంఛార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు తెలియజేయాల్సి ఉంది. ఆయన ప్రస్తుతం చెన్నైలో లేకపోవడంతో వచ్చిన తర్వాత ఈ తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేయనున్నారు. ఇప్పటికే పోయిస్‌ గార్డెన్‌లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళతో పన్నీర్‌ సెల్వం సమావేశమై పదవీ బాధ్యతలు చేపట్టాలని కోరారు. పన్నీర్‌ సెల్వం తన రాజీనామా లేఖను ప్రస్తుతం గవర్నర్‌కు పంపించాల్సి ఉంది. అయితే, పన్నీర్‌ రాజీనామా చేయడం ఓ లాంఛనప్రాయమనే చెప్పాలి. తదుపరి ఏర్పాట్లు జరిగే వరకు ఆయనే సీఎంగా కొనసాగుతారు. ఈ నెల 9, 10 తేదీల్లో మంచి ముహూర్తం ఉండటంతో ఆ రోజుల్లోనే శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *