
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం తరఫున 1.95 లక్షల మంది ముస్లింలకు ఈ నెల 12న మసీదులో భోజనంతో పాటు నూతన వస్త్రాలను పంపిణీ చేయనున్నట్లు రంజాన్ ఉత్సవ కమిటీ చైర్మన్ ఏకే ఖాన్ పేర్కొన్నారు. నాంపల్లిలోని హాజ్ భవన్‌లో మసీదు కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, మైనారిటీ కమిషన్ స్పెషల్ సెక్రటరీ మహ్మద్ జలీల్ అతిథులుగా హాజరయ్యారు. ఏకే ఖాన్ మాట్లాడుతూ గ్రేటర్‌లోని వంద మసీదులు, తెలంగాణలోని పది జిల్లాలో 1.95 లక్షల మంది ముస్లింలకు కుర్తా, పైజామా, రెండు చీరలతో కూడిన సెట్‌ను ఉచితంగా అందజేయనున్నట్లు చెప్పారు. రంజాన్ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.26 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నెల 18న రంజాన్‌ను ఘనంగా నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.




