హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం దీపావళి సెలవులో మార్పుచేసింది. ఈ నెల 19వ తేదీ గురువారం దీపావళి సెలవుగా ప్రకటించింది. 18వ తేదీన ఐచ్ఛిక సెలవు ఉంటుందని తెలిపింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. 18న దీపావళి సెలవు ఉంటుందని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. అయితే 19వ తేదీన అమావాస్య కావడంతో అదే రోజున దీపావళి జరుపుకోవాలని పలువురు పండితులు, ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే నరక చతుర్దశికి 17వ తేదీన ఐచ్చిక (ఆప్షనల్) సెలవు ఉండగా దానిని 18వ తేదీకి మార్చారు. దీంతో 18వ తేదీ ఐచ్ఛిక సెలవు, 19వ తేదీని దీపావళి సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు పాఠశాలలు, కాలేజీలకు ఇచ్చే సెలవును 19వ తేదీకి మార్చుతూ విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. దీనికి సంబంధించి జిల్లా విద్యాధికారులకు, స్కూల్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీచేశారు. కాగా, దీపావళి సందర్భంగా ఉమ్మడి హైకోర్టుకు ఈనెల 17,18,19 తేదీల్లో సెలవులను ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీచేశారు. దిగువ కోర్టులకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయి.
17,18,19 తేదీల్లో దీపావళి సెలవులు




