– వామపక్షాలతో కలిసి పోటీకి దిగుతాం
– స్పష్టం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
హైదరాబాద్, జనవరి3(జనంసాక్షి) : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తామని, వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. 175 నియోజక వర్గాల్లోనూ పోటీచేస్తామని స్పష్టంచేశారు. కేంద్రంపై పోరాటానికి పవన్ కలిసి రావాలని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చిన నేపథ్యంలో పవన్ ఈ విధంగా స్పందించడం గమనార్హం. వామపక్షాలతో తప్ప ఎవ్వరితోనూ కలిసి వెళ్లమని, యువతకు, మహిళలకు ఎక్కువ అవకాశం ఇస్తామని అన్నారు. దయచేసి అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని, ముక్తకంఠంతో ఖండించండి అంటూ పవన్ తన ట్విటర్‌లో పేర్కొన్నారు. బుధవారం సొంత నియోజకవర్గం కుప్పంలో నిర్వహించిన ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్య పరిరక్షణకు దేశవ్యాప్తంగా ఎవరు కలిసివస్తారో వారిని కలుపుతూ ముందుకు వెళతాం. పవన్‌కల్యాణ్ కూడా మోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారని చెప్పారని, ఆయన వేసిన నిజనిర్ధారణ కమిటీలో రాష్ట్రానికి రూ.70వేల కోట్లు రావాలని తేల్చారని, ఆయన కూడా మాతో కలిసి కేంద్రంపై పోరాటానికి రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ ఈ ట్వీట్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం నుంచి జిల్లాల వారీగా పార్టీ నాయకులు, అభిమానులతో చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాలతో పొత్తులు ఉండవని సంకేతం ఇచ్చారు.
సీపీఐ, సీపీఎం, జనసేన కలిసి పోటీ : నారాయణ
ప్రజల్లో టీడీపీ పై వ్యతిరేఖత వచ్చిందని, దీంతోనే రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగితే ఓటమి పాలవుతానని భావించి చంద్రబాబు పవన్‌తో కలుస్తామంటున్నారని సీపీఐ నేత నారాయణ అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, జనసేన కలిసి పోటీ చేస్తాయని స్పష్టం నారాయణ చేశారు. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో కేసీఆర్‌తో కలిసి ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారన్నారు. అమిత్‌షా, మోదీ వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పును కేరళ ప్రభుత్వం అమలు చేస్తోందని, శనిశింగణాపూర్‌లో కూడా మహిళలు ఆలయ ప్రవేశం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కావాలనే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయ లబ్ధికోసం దేవాలయాలను ఉపయోగించుకుంటున్నారని నారాయణ విమర్శలు గుప్పించారు.
175స్థానాల్లో పోటీ చేస్తాం




