Tuesday, 3 November 2026

200 తీర్మానాలపై కేసీఆర్‌ స్పందించాలి

– బీసీ డిక్లరేషన్‌ ఏమైంది?
– ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య
హైదరాబాద్‌, మే3(జ‌నం సాక్షి) : బీసీ నాయకులతో గత డిసెంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో 200 తీర్మానాలు ప్రతిపాదించారని, ఐదునెలలు గడస్తున్నా అతీగతీ లేదని టీ.టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య మండిపడ్డారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తీర్మాణాలపై కేసీఆర్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. 500 బీసీ రెసిడెన్షియల్‌ స్కూలు, 100 బీసీ డిగ్రీ కాలేజీల ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. పేదలకు రుణాలు ఇవ్వకపోతే బ్యాంకుల ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. బ్యాంకుల్లో అవినీతి బాగా పెరిగిపోయిందన్నారు. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని అన్నారు. బీసీ డిక్లరేషన్‌ చేయాలని, చట్ట సభల్లో యాభై శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరుగుతుందని భావిస్తే ఆశించిన మేర న్యాయం చేకూరడం లేదన్నారు. బీసీలను ఇప్పటికీ రాజకీయ పార్టీలు పావులుగా వాడుకుంటున్నాయే తప్ప బీసీలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టేందుకు చొరవ చూపడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్‌ల ప్రకారం 50శాతం సీట్లు కేటాయించాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.