Wednesday, 4 November 2026

2005కు ముందు కరెన్సీ వెనక్కు

ఆర్‌బీఐ సంచలన నిర్ణయం
ముంబై, జనవరి 22 (జనంసాక్షి) :
భారత రిజర్వ్‌ బ్యాంక్‌ బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది. 2005 సంవత్సరానికి ముద్రించి, ప్రస్తుతం చెలామణీలో ఉన్న కరెన్సీని వెనక్కు తీసుకోనున్నట్లు పేర్కొంది. 2014 మార్చి 31 తర్వాత ఆ నోట్లను వెనక్కి తీసుకుంటామని ప్రకటించింది. ఇది కొత్తగా అమలు చేస్తున్న విధానం కాదని, గతంలోనూ చాలా సార్లు పాత కరెన్సీని వెనక్కి తీసుకున్నామని ఈ విషయంలో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ తెలిపింది. ప్రజల తమ వద్ద ఉన్న నోట్ల మార్పిడి కోసం 2014, ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి బ్యాంకుల్లో సంప్రదించాలని సూచించింది. బ్యాంకులు ఈమేరకు ప్రజలకు సహకరిస్తాయని పేర్కొంది. ఆర్‌బీఐ నుంచి తదుపరి సమాచారం అందేవరకూ బ్యాంకులు నోట్ల మార్పిడి చేస్తాయని ప్రకటించింది. 2005కు ముందు నోట్లను గుర్తించడం సులభమని, వాటికి రెండువైపులా ముద్రించిన సంవత్సరం వివరాలు ఉండవని ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంకులు వాటి ఖాతాదారులకు, ఖాతాదారులు కాని వారిని నోట్ల మార్పిడి సదుపాయం కల్పించాలని సూచించింది. 2014 జులై ఒకటో తేదీ నుంచి రూ.500, రూ.1000 నోట్లకు సంబంధించి 10 కన్నా ఎక్కువ నోట్లను మార్చుకోవాలనుకునే వారు తమ వ్యక్తిగత వివరాలు, చిరునామాకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *