వారానికి మించకపోవచ్చు
న్యూఢిల్లీ, జనవరి 22 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై శాసనసభ, మండలి తమ అభిప్రాయాలు తెలిపేందుకు రాష్ట్రపతి ఇచ్చిన ఆరువారాల గడువు గురువారంతో ముగియనుంది. సభలో ఇంకా పలువురు సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పాల్సి ఉన్నందున తొమ్మిది వేలకు పైగా సవరణ ప్రతిపాదనలపై చర్చ ఓటింగ్ జరపాల్సిన ఉన్నందున మరో నెల రోజుల పాటు గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా రాష్ట్రపతికి లేఖ రాశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి కూడా నెల రోజుల గడువు కావాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ముసాయిదాపై అభిప్రాయాలు తెలిపేందుకు గడువు పెంచవచ్చా లేదో అటార్నీ జనరల్‌ను సంప్రదించి సమాచారం ఇవ్వాలంటూ రాష్ట్రపతి భవన్ కార్యదర్శి కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఈమేరకు అటార్నీ జనరల్ గులా ఇ వాహనవతిని న్యాయ సలహా కూడా కోరారు. ఆయన సూచన మేరకు అసెంబ్లీ, మండలి అభిప్రాయాలు తెలిపేందుకు మరో వారం గడువివ్వాలని రాష్ట్రపతిని కోరినట్లు తెలిసింది. అయితే తమ ప్రతిపాదనలేవి హోం శాఖ వర్గాలు ధ్రువీకరించలేదు. రాష్ట్రపతి వద్దే గడువు పొడిగింపునకు సంబంధించిన ఫైల్ పెండింగ్‌లో ఉందని, గురువారం మధ్యాహ్నానికి నిర్ణయం వెలువడవచ్చని పేర్కొంది. గడువు పొడిగించారంటూ మీడియాలో వచ్చిన కథనాలు నిరాధారమని హోం శాఖ కొట్టిపారేసింది. మరోవైపు ముసాయిదాపై చర్చించిన ఫైల్‌ను ఎలా పంపాలో హోం శాఖ సీఎస్‌కు మహంతికి దిశా నిర్దేశనం చేసింది. ఈమేరకు బీహార్ నుంచి జార్ఖండ్ విభజన సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదికను చూపించింది. బుధవారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్న సీఎస్ ఈమేరకు స్పీకర్ వద్ద నుంచి ముసాయిదాపై సాగిన చర్చ సంబంధించిన వివరాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ రాష్ట్రపతి కనుక గడువు పొడగింపునకు నిరాకరిస్తే గురువారం రాత్రి వరకు సాగిన సభా వివరాలు స్పీకర్ కార్యాలయం శుక్రవారం మధ్యాహ్నానికి సీఎస్‌కు పంపే అవకాశముంది. ఆయన దానిని క్రోడికరించి శనివారానికల్లా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపవచ్చు. ఒకవేళ రాష్ట్రపతి గడువుపొడిగిస్తే ముసాయిదాపై సభ్యులను ఏదో రూపకంగా చర్చలో భాగస్వాములను చేసేలా స్పీకర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ముసాయిదాపై రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో గురువారం తేలనుంది. ఆలోగానే సీఎం ప్రసంగం ముగించి సభ్యుల అభ్యంతరాలను కూడా స్వీకరించే అవకాశముంది.
తెలుగు సినిమా దిగ్గజం అక్కినేని ‘అమరజీవి’
నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు : మంత్రి డీకే అరుణ
కడసారి చూపునకు క్యూ కట్టిన ప్రముఖులు, అభిమానులు
హైదరాబాద్, జనవరి 22 (జనంసాక్షి) :
తెలుగు సినీదిగ్గజం, ఆంధ్రుల ఆరాధ్య నటుడు అక్కినేని నాగేశ్వరావు కన్నుమూశారు. తెలుగుచిత్ర సీమకు మహాదిగ్గజంగా నిలిచిన ధ్రువతార నేల రాలిపోయింది. వెండితెరమీద మరో శకం ముగిసింది. ఆరు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణానికి తెరపడింది. వెండితెరపై తన నట వైదుష్యంతో దశాబ్దాలపాటు తెలుగువారిని అలరించిన మహానటుడు మరిక లేరు. అచ్చమైన తెలుగుదనానికి నిలవుటద్దంగా నిలిచిన మహానట సామ్రాట్ ఇక మనకు లేరు. ఎన్టీఆర్ వర్ధంతికి మూడు రోజుల తరవాత, అలనాటి అందాల నటి అంజలి మరణానికి వారం రోజుల తేడాతో తానూ ఉండలేనంటూ వెళ్లిపోయారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సహా పద్మవిభూషణ్ లాంటి ఎన్నో సత్కారాలు అందుకున్నా అభిమానుల ఆదరణెళి తనకు అవార్డులని చెప్పుకున్న నిగర్వి ఆయన. అన్నపూర్ణ రాకతో ఆయన జీవితం సంపూర్ణం అయిందనడంలో సందేహం లేదు. ఇటీవలే ఆమె మరణం కూడా ఆయనను కొంత కుంగదీసి ఉంటుందో ఏమో అన్నపూర్ణ నేను కూడా అంటూ వెళ్లిపోయారీ బాటసారి. ఇటీవలే తన ఒంట్లో కొంత నలతగా ఉందని.. వైద్యులు పరీక్షించి కేన్సర్ అని తేల్చారని.. ప్రేక్షకులు దీవిస్తే నిండు నూరేళ్లూ జీవించగలనని ఆత్మవిశ్వాసంతో చెప్పిన అసమాన ధైర్యశాలి ఆయన. క్యన్సర్ వచ్చినా నిలిచి గెలుస్తాడని అనుకున్నా ఆ భగవంతుడు మాత్రం నువ్వు రావాల్సిందే అంటూ తోడ్కొని పోయారు. భగవంతుడిపై నమ్మకం లేకపోయినా జీవితాంతం నాస్తికుడిగానే ఉన్నారు. పూజలు, పునస్కారాలకు దూరంగా ఉన్నా పరమభక్తుడి పాత్రలు ఎన్నో వేసి మెప్పించిన ధీరోదాత్తుడైన ఈ హీరో అంతలోనే తన జీవన ప్రస్థానాన్ని ముగించారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆయన ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు 2.45 గంటల సమయంలో బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వెంటనే వైద్యులు ఎమర్జెన్సీకి తరలించి ఆక్సిజన్ పెట్టిన పదినిమిషాలకే ఆసుపత్రికి వచ్చిన డా.సోమరాజు వైద్యుల బృందంతో కలసి పరిశీలించారు. అప్పటికే శ్వాస ఆగిపోవటంతో ఆయన చనిపోయినట్లు నిర్ధారించి కుటుంబసభ్యులకు తెలిపారు. ఆ సమయంలో కుమార్తె నాగసుశీల, మనవడు సుశాంత్ పక్కనే ఉన్నారు. అక్కినేనికి పేగు క్యాన్సర్ వ్యాధి బయటపడడంతో కిమ్స్ ఆసుపత్రిలో ఇటీవల శస్త్ర చికిత్స చేసి ఆ భాగాన్ని తొలగించారు. ఆ తరువాత కీమోథెరపీతో వైద్యం అందిస్తున్నారు. ఇటీవలే ఆయన ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు వచ్చాయి. అయితే ఆయన క్షేమంగానే ఉన్నారని కుటుంబసభ్యులు ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన చక్రాలకుర్చీలోనే తిరుగుతున్నారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను, కోట్లాది మంది తెలుగువారిని విషాద సముద్రంలో ముంచేసిన ఆ మహానటుడు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. విషయం తెలియగానే ఆయన బంధువులు, అభిమానులు ఆస్పత్రికి చేరుకున్నారు.
అక్కినేని పార్థివదేహాన్ని ఉదయం కేర్ ఆస్పత్రి నుంచి అన్నపూర్ణ స్టూడియోకు తరలించారు. తమ అభిమాన నటుడు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావును కడసారి చూసేందుకు పలువురు ప్రముఖులు అన్నపూర్ణ స్టూడియోకు తరలివచ్చారు. కేంద్ర మంత్రి చిరంజీవి, సినీనటులు కృష్ణ, కృష్ణరాజు దంపతులు, క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా తదితరులు అక్కినేని బౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అక్కినేని కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. అక్కినేని భౌతికకాయం వద్ద నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అక్కినేని పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆమెతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు సుచరిత, శోభా నాగిరెడ్డి ఉన్నారు. కాగా ఏఎన్‌ఆర్ మృతిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఓ ప్రకటనలో ప్రగాఢ సానుభూతి వ్యక్తి చేశారు. మరోవైపు అక్కినేని నాగేశ్వరరావు మృతితో సినిమా పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణం గురించి తెలియగానే పరిశ్రమకు చెందిన సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలపడానికి ఆయన నివాసానికి క్యూ కట్టారు. అక్కినేనితో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు.. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. కృష్ణ, జమున, డి.రామానాయుడు, దాసరి నారాయణరావు, వీబీ రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, తమ్మారెడ్డి భరద్వాజ, మోహన్‌బాబు, డాక్టర్ సి. నారాయణరెడ్డి, పరుచూరి బ్రదర్స్, చలపతిరావు, హరికృష్ణ, కళ్యాణ్ రామ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కృష్ణంరాజు దంపతులు, జగపతి బాబు, రాజీవ్ కనకాల, దగ్గుబాటి సురేష్ బాబు, జయసుధ, నితిన్ కపూర్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, నన్నపనేని రాజకుమారి, జూలకంటి రంగారెడ్డి, రాజేందప్రాసాద్, నాదెండ్ల మనోహర్, జయప్రకాష్ నారాయణ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు అక్కినేని పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. జయసుధతో పాటు హేమ తదితరులు ఎక్కువ సేపు అక్కడే గడిపారు. అక్కినేని నాగేశ్వరరావు భౌతికకాయాన్ని సినీనటుడు మహేష్‌బాబు, ఆయన భార్య నమ్రతా శిరోథ్కర్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, సినీనటుడు ప్రకాశ్‌రాజ్, శరత్ కుమార్ ,రాధిక దంపతులు,జీవితా రాజశేఖర్, రానా తదితరులు సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. అక్కినేని భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో అన్నపూర్ణస్టూడియో వద్దకు తరలి వచ్చారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అక్కినేని భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కేంద్ర మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రి జానారెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మంత్రి దానం నాగేందర్, టిడిపి సీనియర్‌నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, జయప్రకాశ్ నారాయణ ప్రజాగాయకుడు గద్దర్ తదితరులు అక్కినేని బౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అక్కినేని నాగేశ్వరరావు మరణవార్తను తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అన్నపూర్ణ స్టూడియోకి తరలివచ్చారు. అక్కినేని బౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సందర్శించి నివాళులర్పించారు. అన్నపూర్ణ స్టూడియోకు వచ్చిన చంద్రబాబు అక్కినేని భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు తెలుగు కళామతల్లికి రెండు కళ్లుగా ఉన్నారన్నారు. తెలుగు సినిమా అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ అని చరిత్ర సృష్టించారన్నారు. అక్కినేనితో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఏఎన్నార్‌లో పాజిటివ్ దృక్పథం ఎక్కువగా ఉండేదన్నారు. అక్కినేని మృతి సినీపరిశ్రమకు తీరని లోటన్నారు. సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల తమిళనాడు గవర్నర్ రోశయ్య సంతాపం వ్యక్తం చేశారు. అక్కినేని మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. అక్కినేని సుదీర్ఘ నటనా ప్రస్థానం… ఆయన మరణంతో ఒక శకం ముగిసిందని సంతాపం సందేశంలో పేర్కొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వేర్వేరుగా సంతాపం తెలిపారు. అక్కినేని మృతి సినీ పరిశ్రమకు, తెలుగు ప్రజలకు తీరని లోటని అన్నారు. కళారంగానికి అక్కినేని చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అక్కినేని మృతితో తెలుగు చలన చిత్ర పరిశ్రమ శోకసంద్రంలోకి వెళ్లిందని నందమూరి హరికృష్ణ అన్నారు.
అక్కినేని నాగేశ్వరరావు మరణం తెలుగు చలన చిత్ర రంగానికే కాకుండా, తనను కూడా దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్రమంత్రి పురంధేశ్వరి పేర్కొన్నారు. బుధవారం అన్నపూర్ణ స్టూడియోలోని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ వ్యక్తిగతంగా తనకు, తన కుటుంబానికి ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టుగా బాధపడుతున్నామని అన్నారు. ప్రత్యేకించి తన తండ్రి నందమూరి తారక రామారావు, నాగేశ్వరరావుల మధ్య ఉన్నటువంటి బాంధవ్యం ఏదైతే ఉందో అది ఒక రంగంలో ఉన్నటువంటి సమకాలీకుల బాంధవ్యం వారిదన్నారు. అలాంటిది ఆయన మరణంతో ఒక పెద్ద దిక్కును కోల్పోయామని ఆమె ఆవేదనగా చెప్పారు. మా చిన్నతనంలో మద్రాస్‌లో ఉన్న సమయంలో హైదరాబాద్ వచ్చినప్పుడు నాగేశ్వరరావు ఇంటికి వెళ్ళేవాళ్లమని ఆమె అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు మృతి రాష్టాన్రికే కాదు.. యావత్ దేశానికే తీరని లోటని సిపిఎం నేత రాఘవులు భార్య పుణ్యవతి అన్నారు. అక్కినేని భౌతిక కాయాన్ని ఆమె సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పుణ్యవతి విూడియాతో మాట్లాడుతూ. చిత్రపరిశ్రమలో ఏఎన్నార్ కు ఎన్నో అవార్డులు వచ్చాయని.. అయితే ఏఎన్నార్ ఆ అవార్డులకే గౌరవం తెచ్చారన్నారు. సినీ పరిశ్రమలో గొప్ప వ్యక్తిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో చిత్రపరిశ్రమ అనేక మంది ప్రముఖుల్ని కోల్పోయిందన్నారు. ఇది చాలా దురదృష్టకరమని.. ముఖ్యంగా అక్కినేని లాంటి మార్గదర్శకుల మృతి చాలా బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. ఏఎన్నార్ మృతి పట్ల ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సినీ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని సినీ రంగానికి చెందిన పలువురు అన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఏఎన్నార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అక్కినేని నాగేశ్వర్ రావు మృతి బాధాకరమని నటుడు కృష్ణ అన్నారు ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటు. నాకు సినిమాల్లో నటించే అవకాశం రావడంలో ఆయన కృషి ఉంది. ఏఎన్నార్ అన్ని రకాల పాత్రల్లో నటించారు. నేను ఆయనతో చాలా సినిమాల్లో నటించానని నివాళి అర్పించారు. అక్కినేని నాగేశ్వర్ రావు గారు మృతి చెందడం దురదృష్టకరమని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఎన్‌టీఆర్, ఏఎన్నార్ తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్ల లాంటివారు. నాగేశ్వర్‌రావు మృతితో సినీ పరిశ్రమ రెండో కన్నును కోల్పోయిందని అన్నారు. అక్కినేని మృతి బాధాకరం. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద లోటని దర్శకుడు శ్రీను వైట్ల అన్నారు. ఎన్‌టీఆర్, ఏఎన్నార్ ఆణిముత్యాల లాంటివారని, ఏఎన్నార్ మృతి సినీ పరిశ్రమకు తీరనిలోటని నటి రోజా అన్నారు. కొత్తవారికి స్ఫూర్తి నిచ్చేలా ఎన్ టిఆర్, ఏఎన్నార్ పేరుతో సినీ పరిశ్రమకు పేరు పెట్టాలన్నారు. ఆయనతో కలిసి నటించే అవకాశం లభించిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళి అర్పించారు. అక్కినేని నాగేశ్వర్ రావు మృతితో టాలీవుడ్ ఒక అద్భుత నటుడిని కోల్పోయిందని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ఏఎన్నార్ మరణించడం బాధాకరమన్నారు. మానవత విలువలు కలిగిన గొప్ప వ్యక్తి ఏఎన్నార్ అని వైవిఎస్ చౌదరిఎన్ అన్నారు. ఎన్‌టిఆర్, ఏఎన్నార్ తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్ల లాంటివారన్నారు. అక్కినేని నాగేశ్వర్ రావు మృతి చెందడం బాధాకరంఅలనాటి సినీ నటి శారద అన్నారు. ఆయన నాకు సినీ గురువు లాంటివారు. ఆయన మృతి చెందారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన మరణించారంటే నమ్మశక్యంగా లేదు. ఆయనతో నేను మొదటగా ఇద్దరు మిత్రులు సినిమాలో ఏఎన్నార్ కు చెల్లెలుగా నటించాను. ఏఎన్నార్ అందరినీ నవ్వించేవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఆము నివాళి అర్పించారు. ఏఎన్నార్ మరణించడం దురదృష్టకరం. ఆయన నాకు తాతయ్య లాంటి వారు అని సినీ నటి విూనా నివాళి అర్పించారు. నా మొదటి సినిమా ఆయనతో చేయడం చాలా సంతోషం కలిగించింది. నాకు ఆయన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. నాలో ఆత్మవిశ్వాసం పెంపొందించారు. ఆయనకు అసలు గర్వం లేదు. చాలా ప్రాక్టికల్ గా ఉండేవారు. అంటూ విూనా నివాళి అర్పించారు.
అక్కినేనికి ఉభయసభలు నివాళి
అక్కినేని నాగేశ్వరరావు మృతికి ఉభయసభలు తీవ్ర సంతాపం ప్రకటించాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ ఉభయసభలు రెండు నిముషౄలు మౌనం పాటించాయి. శాసనమండలిలో ఛైర్మన్ చక్రపాణి అక్కినేని మరణ వార్తను తెలిపారు. ఆయన మృతికి సభ్యులు సంతాపంగా లేచి మౌనం పాటించారు. అసెంబ్లీలో అక్కినేని మృతిపై సభ్యులు సంతాపం ప్రకటించారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల శాసనసభ ప్రగఢ సంతాపం ప్రకటించింది. రాష్ట్ర చలనచిత్ర అభివద్ధికి అక్కినేని తోడ్పాటు అందించారని స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. చలనచిత్ర నటుడిగానే కాకుండా సంఘజీవిగా అక్కినేని పలు సేవలు అందించారు. ప్రాంతాలు పక్కనపెట్టి అక్కినేని వంటి మహనీయుల్ని గుర్తుంచుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు లాంటి నటులు మనకు స్పూర్తిదాయకమన్నారు. అక్కినేని మృతికి సంతాపం తెలుపుతూ శాసనసభ చేపట్టిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ ప్రాంతాలు పక్కన పెట్టి అక్కినేని వంటి మహనీయుల్ని గర్తుంచుకోవాలన్నారు. చెన్నారెడ్డి, బ్రహ్మనందరెడ్డి పేర్లతోనూ టిడిపి ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేసిందని చంద్రబాబు గుర్తుచేశారు. ఈ సందర్భంగా సభలో కొంత వాగ్వివాదం జరిగింది. చంద్రబాబు ప్రసంగాన్ని కాంగ్రెస్ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో బుద్ది లేకుండా మాట్లాడావద్దని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి చంద్రబాబు అవేశంగా మాట్లాడారు. దీంతో సభలో టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సంతాపం తెలిపే సమయంలో సభ్యులు సంయమనంతో ఉండటం గౌరవమని మంత్రి రఘువీరా రెడ్డి సూచించారు. అక్కినేనికి సంతాపం తెలిపేందుకు సభ్యులు పరిమితం కావాలి తప్ప వివాదాలు వద్దని ఆయన పేర్కొన్నారు. అక్కినేని సంతాపం తెలిపేందుకు సభ్యులు పరిమితం కాలాలి తప్ప విదాదాలు వద్దని మంత్రి రాఘువీరా సభ్యులను కోరారు.
అక్కినేని మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు : జయలలిత
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మరణం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. ఆయన ఎన్నో సనిమాల్లో నటించి మెప్పించి అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి అని కొనియాడారు. ఆమె ఏఎన్నార్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అనుపమ్‌ఖేర్ తదితరులు సంతాపం తెలిపినవారిలో ఉన్నారు.
వెంకటరాఘవాపురంలో విషాదఛాయలు
విజయవాడ : అక్కినేని మృతితో కృష్ణాజిల్లా వెంకటరాఘవాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇక్కడ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలతో ఆయన గ్రామాన్ని ఆదుకున్నారు. సొంత డబ్బుకు తోడు ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా చొరవ తీసుకున్నారు. ఆయన మరణవార్తతో పిల్లలు మొదలు పెద్దల వరకు అంతా తమ ఆత్మీయుడు పోయాడని కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో ఆయన విద్యాసంస్థలు ఏర్పాటు చేసి విద్యాపరంగా ఊరు రుణం తీర్చుకున్నారు. 1924 సెప్టెంబర్ 20న వెంకటరత్నం-పున్నమ్మ దంపతులకు అక్కినేని ఇక్కడే జన్మించారు. నాలుగో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పారు. రాఘవాపురం పాఠశాల వార్షికోత్సవంలో చంద్రమతిగా ఆడవేషం వేయడంతో ఆయన తన నటజీవితానికి తెరతీసారని చెప్పవచ్చు. తొలినాళ్లలో ఎక్సెల్షియర్ నాటక సంస్థలో పని చేశారు. ఘంటసాల బలరామయ్య ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాక ఆయన 1944 మే 8న సినీనటుడిగా మద్రాసులో అక్కినేని ప్రస్థానం ప్రారంభం అయ్యింది. ‘తల్లిప్రేమ’ చిత్రంలో కుర్రాడిగా తొలివేషం వేసినా అది పెద్దగా పాపులర్ కాలేదు. 17 ఏళ్ల వయస్సులోనే ‘ధర్మపత్ని’ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ‘కీలుగుర్రం’ బాలరాజు చిత్రాలతో జానపద కథానాయకుడిగా, మాస్ హీరోగా తన ముద్ర వేసుకున్నారు. సంసారం అక్కినేని నటించిన మొదటి సాంఘిక చిత్రమని చెప్పవచ్చు. తొలినాళ్లలో తన చిత్రాలకు తానే పాటలు పాడుకునేవారు. అక్కినేని సినీ జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ‘దేవదాసు’. ఇది ఎంతగా పేరు తెచ్చిందంటే దాని తరవాత ఎవరు ఈ సినిమా తీసినా అక్కినేనిని మించి చేయలేకపోయారు. 1953 జూన్ 26న విడుదలై సంచలనం సృష్టించిన ‘దేవదాసు’ అక్కినేని సినీ ప్రస్థానంలో ఓ మైలురాయి. అక్కినేని, ఎన్టీఆర్ కలిసి నటించిన తొలి చిత్రం ‘ప్లలెటూరి పిల్ల’. సంసారం, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ చిత్రాల్లో కూడా ఎన్టీఆర్‌తో కలిసి నటించారు. అలాగే తరవాత రామకృష్ణులు, మౌర్య చంద్రగుప్త సినామాలల్లో కూడా కలసి నటించారు. అక్కినేనిపై ఉన్న అభిమానంతో ఎన్టీఆర్ తన సొంత బ్యానర్‌పై నిర్మించిన మౌర్య చంద్రగుప్తలో చాణుక్యుడి పాత్రను ఇచ్చి చేయించారు. మిసమ్మ, చక్రపాణి, ప్రేమించిచూడు చిత్రాల్లో హాస్యప్రధాన పాత్రల్లో మెప్పించారు. సుడిగుండాలు సినిమాకు మొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. తమిళంలోకి అనువదించిన తొలి తెలుగు చిత్రం అక్కినేని ‘కీలుగుర్రం’. ఓర్ ఇరువు, అన్బుమగళ్, అతిశయపెణ్, దైవమేతునై, ఎంగళ్ సెల్వి, పెణ్‌మనం మొదలైనవి అక్కినేని నటించిన తమిళ చిత్రాలు. అక్కినేనికి తమిళం బాగా వచ్చేది కనుక ఆ చిత్రాల్లో కూడా బాగా నటించి మెప్పించారు.
1957-నటసామ్రాట్, 1968- పద్మశ్రీ, 1977- కళా ప్రపూర్ణ ,1989- రఘుపతి వెంకయ్య అవార్డు, 1991- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కాయి. 1993- గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. 1995లో అన్నా అవార్డును తమిళనాడు ప్రభుత్వం ఇచ్చి సత్కరించింది. ఎన్టీఆర్ చనిపోయాక 1996- ఎన్టీఆర్ జాతీయ ఫిలిం అవార్డు తొలిసారిగా అక్కినేనికి ఇచ్చారు. 1998- పద్మభూషణ్ , 2011- పద్మవిభూణ్ అవార్డులతో కేంద్రం సత్కరించింది. 2012లో తానా జీవిత సాఫల్య పురస్కారం, నాలుగు సార్లు ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి. మేఘసందేశం, బంగారు కుటుంబం చిత్రాలకు నంది అవార్డులు వచ్చాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి కాళిదాసు కౌస్తుబా అవార్డు ఇచ్చి సత్కిరంచింది. కాళిదాసు చిత్రంలో ఆయన నటనకు గాను ఈ అవార్డు దక్కింది. అక్కినేని భార్య అన్నపూర్ణ ఇటీవలే మరణించారు. ఆయనకు సత్యవతి, నాగసుశీల, సరోజ ముగ్గురు కూతుల్లు కాగా, వెంకట్, నాగార్జున ఇద్దరు కొడుకులు.
స్కూలులో చదువుకున్నది తక్కువ..జీవితంలో చదివిందే ఎక్కువ
అక్కినేని నాగేశ్వరరావు జీవితం ఓ అనుభవ సారమంటే అతిశయోక్తి లేదేమో. ఆయన చదవింది నాలుగో తరగతి మాత్రమే అయినా ఏనాడూ కుంగిపోలేదు. ఏనాడు తాను చదవుకోలేదని బాధపడలేదు. అకుంఠిత దీక్షతోనే ఆయన ఇంగ్లీష్‌తో సహా తమిళం, హిందీ తదితర భాషలు నేర్చుకున్నారు. ప్రపంచాన్ని చదివారు. ఆయన యంగ్ హీరోగా రాణిస్తున్న రోజుల్లో చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడుకునేవారు. దాంతో అక్కినేనికి ఇంగ్లిష్ అర్థమయ్యేది కాదు. ఓ ఆహ్వానం మేరకు ఆయన శ్రీలంక వెళ్లినప్పుడు అందరూ ఇంగ్లీష్‌లో మాట్లాడితే.. అక్కినేని మాత్రం తమిళంతో మేనేజ్ చేశారు. తర్వాత పట్టుదలతో ఆయన ఆంగ్లం నేర్చుకున్నారు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలిగే స్థాయికి చేరుకున్నారు. ది హిందూ దినపత్రికను క్రమం తప్పకుండా చదువుతూ ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించారు. ప్రేక్షకులే దేవుళ్ళు అంటూ కొలిచే ఆయన నటనలో తానెప్పుడూ నిత్యవిద్యార్థినే అని వినయంగా చెబుతుండేవారు.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు : మంత్రి డీకే అరుణ
అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు పోలీసు లాంఛనాలతో నిర్వహించనున్నట్లు సమాచార శాఖమంత్రి డి.కె. అరుణ తెలిపారు. అక్కినేని భౌతికకాయాన్ని సందర్శించి ఆమె నివాళులర్పించారు. అక్కినేని తెలుగుచిత్ర పరిశ్రమకు చేసిన సేవలను కొనియాడారు. అక్కినేని మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇందుకు సంతాపంగా గురువారం చిత్ర పరిశ్రమ బంద్ పాటించనుంది. అక్కినేని నాగేశ్వరరావు మృతికి సంతాపంగా గురువారం తెలుగు చలనచిత్ర పరిశ్రమ బంద్‌కు పిలుపునిచ్చింది. చిత్ర పరిశ్రమలోని అన్ని యూనియన్లు బంద్ పాటించాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ పిలుపునిచ్చారు. అన్ని థియేటర్లలో షోలను నిలిపివేయాలని కోరారు. నాగేశ్వరరావు అంత్యక్రియలు ఎప్పుడు జరిపేది సాయంత్రం నిర్ణయిస్తామన్నారు. అక్కినేని పార్థివదేహాన్ని సందర్శించేందుకు పెద్దఎత్తున తరలి వస్తున్నందున వారందరూ భౌతికకాయాన్ని చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అందుకు అభిమానులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అన్నపూర్ణలోనే అంత్యక్రియలు
అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం మూడు గంటకు అన్నపూర్ణా స్టూడియోలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ మేరకు మా అధ్యక్షుడు మురళీమోహన్ కూడా ప్రకటన చేశారు. అయితే ముందుగా ప్రకటించినట్లు కాక అన్న పూర్ణ స్టూడియోలోనే అంత్యక్రియలు నిర్వహిస్తారు. పోలీసు లాంఛనాలతో అక్కినేని అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం ఫలిం చాంబర్ నుంచి అంతిమయాత్ర ఉంటుంది. ఇదిలావుంటే అక్కినేని నాగేశ్వరరావు మృతికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబ సభ్యులకు తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్ సంతాపం తెలిపారు. 2012లో అక్కినేని అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు తానా ఆయనపై ప్రత్యేకంగా నాణాన్ని విడుదల చేయడం తానాకు గర్వకారణమన్నారు.




