Tuesday, 3 November 2026

2018 మార్చిలోగా లక్ష ఎకరాలకు సాగునీరు

– పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్క్టు దిండిని అనుసంధానం చేస్తాం

– గాంధీభవన్‌లో అడగాల్సిన ప్రశ్నలను అసెంబ్లీలో అడిగితే ఎలా!

– కాంగ్రెస్‌ సభ్యులు ద్వంద వైఖరిని విడనాడాలి

– అసెంబ్లీలో భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్‌, నవంబర్‌16(జ‌నంసాక్షి) : 2018 మార్చిలోగా లక్ష ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులపై ఎమ్మెల్యే వేముల వీరేశం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ఉదయం సముద్రం ఎత్తిపోతల పథకం కింద మునుగోడు నియోజకవర్గంలో 10,270.. నల్లగొండ నియోజకవర్గంలో 24,468… నకిరెకల్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 62476.. తుంగతుర్తి నియోజకవర్గంలో 2784 ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు మంత్రి వివరించారు. కాంగ్రెస్‌ హయంలో పథకం పనులు నిర్లక్ష్యంగా జరిగాయన్నారు. ప్రాజెక్ట్‌ కోసం 2130 ఎకరాలు సేకరించాల్సి ఉందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు దిండి ప్రాజెక్టును అనుసంధానం చేయడ వల్ల దిండి ప్రాజెక్టు కింద ప్రాంత ప్రజలు నష్టపోయే ప్రమాదం తెలిపారు. అదేవిధంగా శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి దిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 107 పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌ రావు సమాధానమిచ్చారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో దిండి ఎత్తిపోతల ప్రాజెక్టును అనుసంధానం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచందర్‌ గాంధీభవన్లో అడగాల్సిన ప్రశ్నలు అసెంబ్లీలో అడుగుతున్నారని ఎద్దేవాచేశారు. దిండి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా గ్రీన్‌ ట్రిబ్యూనల్‌లో పులులు ఉన్నాయని, అటవీ విస్తీర్ణం తగ్గిపోతుందని కేసు వేసింది విూ కాంగ్రెస్‌ నేతలేనని, ఇప్పటికైనా గాంధీభవన్‌లో విూ కాంగ్రెస్‌ నేతలను నిలదీసి కేసులు ఉపసంహరించుకోవాలని సూచించాలని, అప్పుడే అసెంబ్లీలో మాట్లాడితే ప్రజా సమస్యలపై మాట్లాడినట్లు ఉంటుందని మంత్రి హరీష్‌రావు సూచించారు. ఒకరోజుకు శ్రీశైలం నుండి రెండు టీఎంసీలు తీసుకొని అర టీఎంసీ దిండి ప్రాజెక్టుకు, ఒకటిన్నర టీఎంసీనీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ కు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీని వల్ల ఏ ప్రాంతంలో నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు లేకుండా ఇతర ప్రాంతాల నేతలతో నల్గొండకు వ్యతిరేఖంగా మాట్లాడించి కాంగ్రెస్‌ పార్టీ నేతలు ద్వంద వైఖరిని అవలంభిస్తున్నారని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ వైఖరి ఇక్కడే తేటతెల్లమవుతుందని పేర్కొన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి దిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం జీఓనెం 107ను 2015లోనని .. కాంగ్రెస్‌ నేతలు చెప్పినట్లు జారీ చేసిందని 2017లో కాదని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దిండి నుంచి అచ్చంపేటలో 14,430 ఎకరాలకు, కల్వకుర్తిలో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రి తెలియజేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ నేతలు తీరు మార్చుకొని మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వంతో కలిసి రావాలని హరీష్‌రావు కోరారు.