రాష్ట్రంలో అభివృద్ధి పండుగ: మంత్రి హరీశ్ రావు
రాష్ట్రంలో అభివృద్ధి పండుగ జరగుతున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. నిన్న ఒక్కరోజే 9 మెడికల్ కాలేజీ లు ప్రారంభించుకున్నామని, నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును (PRLIS) సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభిస్తున్నారని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండా, ఒక రూపాయి అప్పు లేకుండా బీసీ బంధు (BC Bandhu) కింద లబ్ధిదారులకు నేరుగా రూ.లక్ష ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీసీ బంధు, మైనార్టీ బంధు లబ్ధిదారులకు మంత్రి హరీశ్ రావు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వెనుకబడిన
వర్గాలను అభివృద్ధి చేయాలనే గొప్ప సంకల్పంతో బీసీ బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. బీసీల సంక్షేమంతోపాటు అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు.
మైనార్టీల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీశ్ అన్నారు. మైనార్టీలు సురక్షితంగా ఉన్నారంటే అది తెలంగాణలోనేనని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభద్రత భావంతో ఉన్నారని తెలిపారు. మైనార్టీ సంక్షేమంతోపాటు విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. కర్ణాటకలో ముస్లిం మైనార్టీలు 90 లక్షల మంది ఉన్నారని, మహారాష్ట్రలో 1.5 కోట్లు, పశ్చిమ బెంగాల్లో 2.55 కోట్లు, ఉత్తర ప్రదేశ్లో 4 కోట్ల మంది ముస్లిం మైనార్టీలు ఉన్నారని వెల్లడించారు. ఈ రాష్ట్రాల్లో ముస్లిం మైనార్టీల కోసం రూ.2 వేల కోట్లకు మించి బడ్జెట్ కేటాయించలేదని విమర్శించారు. అదే తెలంగాణలో 50 లక్షల మంది ముస్లింలు ఉంటే.. రూ.2 వేల కోట్ల బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించిందన్నారు. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ఎంత కట్టుబడి ఉన్నారనేది ఆలోచించాలని సూచించారు.
హిందువులైనా ముస్లింలైనా అందరికోసం పనిచేసే ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ అని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలా పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఇస్తలేదన్నారు. ఇప్పటి వరకు 12,71,000 మంది ఆడపిల్లల పెండ్లికి ఆర్థిక సాయం అందించామని చెప్పారు. ఇప్పటివరకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారఖ్ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.11 వేల 130 కోట్లు వెచ్చించిందని తెలిపారు.
ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల కరెంటు వాడకం కంటే హైదరాబాద్ కరెంటు వాడకం ఎక్కువని వెల్లడించారు. తెలంగాణ రాకముందు హైదరాబాద్లో 2 వేల మెగావాట్ల వినియోగంలో ఉంటే నేడు అది 6 వేల మెగావాట్లకు పెరిగిందన్నారు. నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన కరెంటును అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. 60 ఏండ్లలో కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి చేయడం చేతకాలేదని, ఇప్పుడు చేస్తామంటే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు. ఆకలైనప్పుడు అన్నం పెట్టడం చేతకాని కాంగ్రెస్కు.. అవసరానికి గోరుముద్దలు తినిపిస్తామంటే ప్రజలు నమ్మరన్నారు. కాంగ్రెస్ పార్టీకి చేతనైతే అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో తెలంగాణకు మించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి చూపించాలన్నారు.