న్యూఢిల్లీ,మే28( జనం సాక్షి ): నైరుతి రుతుపవనాలు మరో 24 గంటల్లో కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరీన్, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ లోని మరికొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు ప్రవేశించాయని వెల్లడించింది. ఇవి మరింత ముందుకు కదులుతూ వచ్చే 24 గంటల్లో కేరళ, తమిళనాడులోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాలకు తోడు ఆగ్నేయ ఆరేబియా సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడ్డాయని, వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.




