ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
వికారాబాద్,ఫిబ్రవరి7(జనంసాక్షి): ఇంటర్మీడియెట్ పరీక్షలు ఈనెల 27 నుంచి మార్చి 16 వరకు
నిర్వహించనున్నారు. ఇందు కోసం జిల్లాలోని పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాలలో విద్యుత్ సౌకర్యం, మంచినీటి వసతి కల్పించాలని తెలిపారు. విద్యార్థులు ఉదయం 8 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు తప్పనిసరిగా చేరుకోవాల్సి ఉంటుందన్నారు. ఉదయం 9 గంటల తర్వాత వచ్చిన విద్యార్థులను అనుమతించరాదని కచ్చితమైన ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 24 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొదటి సంవత్సరం 8547, రెండో సంవత్సరం 8670 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అనంతరం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతల పరీక్షా వేళలు ఉంటాయని వివరించారు. పరీక్షల సమయంలో ్గ//-లయింగ్ స్కాడ్, సిట్టింగ్ స్కాడ్ ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి అంతరాయం కలగకుండా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఇంటర్మీడియెట్ పరీక్షల నోడల్ అధికారులు శంకర్, జిల్లా కన్వీనర్ టి.రాంచందర్, జిల్లా విద్యాధికారి రేణుకాదేవి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఉపేందర్‌రెడ్డి, ఆర్టీసి అధికారి హరి, జిల్లా పోలీసుశాఖ తరపున రవికుమార్ తదితరులు హాజరైనారు.
27నుంచి ఇంటర్ పరీక్షలు




