Tuesday, 3 November 2026

ఖండాంతర క్షిపణి ‘అగ్ని-5’ ప్రయోగం విజయవంతం

భువనేశ్వర్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి) :
స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అగ్ని-5 బాలిస్టిక్‌ క్షిపణిని రక్షణశాఖ మరోసారి ప్రయోగించింది. ఒడిశా కోస్తా తీరంలోని వీలర్‌ ద్వీపంలోని లాంచ్‌ ప్యాడ్‌-4 నుంచి డిఫెన్స్‌ రీసర్చ్‌ ఆండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గ నైజేషన్‌ (డీఆర్‌డీవో) దీన్ని పరీక్షించిందని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఆదివారం ఉదయం 8.50 గంటలకు అగ్ని-5 క్షిపణిని ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితలం పైన ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అగ్ని-5 క్షిపణి ధ్వంసం చేయగలదు. సుమారు 50 టన్నుల బరువు, 17 మీటర్ల పొడవు ఉండే అగ్ని-5 క్షిపణి ఒక టన్ను బరువైన అణ్వస్త్రాలను మోసుకుపోగలదు. గతంలో 2012, ఏప్రిల్‌, 2న జరిగిన అగ్ని-5 క్షిపణి తొలి పరీక్ష విజయవంతమైంది. అగ్ని-5 ప్రయోగంతో ఖండాతర క్షిపణి రక్షణ వ్యవస్థ ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్‌ చేరింది. అలాగే దేశ అమ్ముల పొదిలో అగ్ని ఓ కీలక ఆయుధం కానుంది. ఇదిలావుంటే రక్షణ రంగ పరిశోధనల్లో ఇకపై స్వయం సమృద్ధికే పెద్దపీట వేయనున్నట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో కొత్త డెరైక్టర్‌ జనరల్‌ అవినాశ్‌ చందర్‌ తెలిపారు. డీఆర్‌డీవో కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఆయన తన ప్రాధాన్యాలను వివరించారు. వివిధ రకాల ఆయుధ వ్యవస్థలు, ముడిపరికరాల అభివృద్ధి కోసం ప్రస్తుతం విదేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నామని, అందుకే ఆయుధ సంపత్తి కోసం ఇకపై 75 శాతం పరిశోధనలు స్వదేశీయంగానే చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధానమైన పలు ప్రాజెక్టుల్ని ప్రస్తుతం డీఆర్‌డీవో చేపట్టిందని, పరిశోధనల్లో మెరుగుదలతోపాటు సరైన సమయానికే ముఖ్యమైన ఆయుధ సంపత్తిని సైన్యానికి అందించడంపై ఇకపై దృష్టిపెడతామని అన్నారు. తేలికపాటి యుద్ధవిమానం (ఎల్‌సీఏ), శతజ్ఞులు, వివిధ క్షిపణి వ్యవస్థల వంటి కీలక ప్రాజెక్టులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *