Tuesday, 3 November 2026

50 రోజులపాటు తెలంగాణ అసెంబ్లీ

రోజూ 10 గంటల నుంచి 1గంట వరకు సమావేశాలు

శనిఆదివారాల్లో అసెంబ్లీకి సెలవు

ప్రధాని పర్యటన సందర్భంగా నవంబర్‌ 27 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ వాయిదా

విపక్షాలకు సవాల్‌ కానున్న సమావేశాలు

హైదరాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): తెలంగాణ శాసనసభ సమావేశాలను 50 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరవాత ప్రప్రథమంగా ఇలా ఏక బిగిన 50రోజుల పాటు సమావేశాలు జరపాలని నిర్ణయించడం విశేషం. బడ్జెట్‌ సమావేశాలను కూడా ఇంత సుదీర్ఘంగా నిర్వహించిన దాఖలాలు లేవు. ఓ రకంగా సమావేశాలను సుదీర్ఘంగా జరపడం ద్వారా విపక్షాలకు ప్రభుత్వం సవాల్‌ విసరబోతున్నది. ఏ సమస్యపై చర్చిస్తారో చర్చించండని సవాల్‌ విసిరినట్లు అయ్యింది.

గురువారం బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉపసభాపతి పద్మాదేవేందర్‌ రెడ్డి అధ్యక్షత వహించారు. 50 రోజుల పాటు రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. పశ్నోత్తరాల సమయాన్ని గంట నుంచి గంటన్నరకు పెంచారు. తొలిరోజు అంటే శుక్రవారం 27న ప్రశ్నోత్తరాల అనంతరం సభను వాయిదా వేస్తారు. ప్రశ్నోత్తరాల తర్వాత బీఏసీ మరోసారి సమావేశం కానున్నది.ఈ బీఏసీ సమావేశంలో ఎజెండా ఖరారు చేస్తారు. కాగా ప్రశ్నోత్తరాల కంటే ముందే వాయిదా తీర్మానాలపై చర్చించాలన్న కాంగ్రెస్‌ డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పుకోలేదు. ప్రాధాన్యతను బట్టి జీరో అవర్‌ తర్వాత చర్చిద్దామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇక.. వచ్చే నెల నవంబర్‌ 27 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ వాయిదా పడనుంది. ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన దృష్ట్యా ఈ నిర్ణయాన్ని బీఏసీ సమావేశంలో తీసుకున్నారు. 50 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని, శని, ఆదివారాలలో అసెంబ్లీకి సెలవు ఉంటుందని నిర్ణయించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపర్యటన సందర్భంగా మూడు రోజుల పాటు అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని బీఏసీలో నిర్ణయించారు. సమావేశంలో సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావు, జానారెడ్డి, కిషన్‌రెడ్డి, మంత్రి ఈటల, చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌, భట్టివిక్రమార్క, చిన్నారెడ్డి, సండ్రవెంకట వీరయ్య పాల్గొన్నారు.

గవర్నర్‌తో తెలంగాణ సీఎం కెసిఆర్‌ భేటీ

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. శాసనసభ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఇది జరిగింది. సమావేశంలో ప్రవేశపెట్టనున్న బిల్లులు, తీర్మానాలను ముఖ్యమంత్రి గవర్నర్‌కు తెలియజేశారు. మరో పక్క వివిధ పార్టీలు కూడా అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నాయి.

ప్రజలకు ఉపయోగపడాలి : కిషన్‌రెడ్డి

శాసనసభ ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని భాజపా నేత కిషన్‌ రెడ్డి అన్నారు. బీఏసీ అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. బిల్లుల విషయంలో ప్రతిపక్షాల సూచనలను పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం చెప్పిందన్నారు. అన్ని విషయాలను సభలోనే చర్చిస్తామని సీఎం పేర్కొన్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎక్కడా సభలు సమావేశాల నిర్వహణకు అనుమతించడంలేదన్నారు.

సమస్యలపై చర్చకు సిద్దం: హరీష్‌

ఏ అంశం విూదనైనా సరే, ఎన్ని రోజులైనా కూడా చర్చిద్దామని సీఎం కేసీఆర్‌ కుండబద్ధలు కొట్టినట్టు

చెప్పారని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. సభలో చర్చ జరగాలని తాము భావిస్తున్నామని అన్నారు. సుదీర్ఘ కాలం సమావేశాలు ఉన్నందున విపక్షాలు తమ సమస్యలను చర్చించాలని అన్నారు. అయితే కాంగ్రెస్‌ మాత్రం రచ్చ చేయాలని చూస్తోందన్నారు. మైక్‌ ఇచ్చి మాట్లాడాలంటున్నాం. ప్రతిపక్షాలకు ఎక్కువ సమయం కేటాయిస్తామంటున్నాం. ప్రధాన ప్రతిపక్షనేత మాట్లాడతానంటే సీఎం కూర్చుని మరీ మైకు ఇచ్చే సంప్రదాయాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇస్తోందన్నారు. శాసనసభ సమావేశాలని హుందాగా నిర్వహించుకోవాలని, మూడు, నాలుగు వారాల పాటు సభని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన చెప్పారు.