శాండియాగో: 54 ఏళ్ల కిందట అదృశ్యమైన విమానం మిస్టరీ వీడింది. చిలీలో ఈ విమానం కూలిపోయినట్టు కనుగొన్నారు. పర్వతారోహకులు విమాన శకలాలను గుర్తించారు. అప్పట్లో ఈ విమానంలో ప్రయాణిస్తున్న 24 మంది మరణించారు. వీరిలో 8 మంది ఫుట్బాల్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. శాండియాగోకి 360 కిలోమీటర్ల దూరంలో 3200 మీటర్ల ఎత్తులో శిథిలాలను కనుగొన్నట్లు పర్వతారోహకులు తెలిపారు.
ఏప్రిల్3, 1961న చిలీ ఫుట్బాల్ జట్టు ప్రయాణిస్తున్న విమానం అదృశ్యమైంది. ఈ సంఘటన దక్షిణ అమెరికాలోనే కాకుండా క్రీడా ప్రపంచానికి ఒక జవాబులేని ప్రశ్నలా మిగిలిపోయింది. ఈ జట్టు విదేశాల్లో ఫుట్ బాల్ ఆడి తిరిగి శాండియాగో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గ్రీన్ క్రాస్ జట్టు సభ్యులు రెండు బృందాలుగా విమానాల్లో బయలుదేరారు. ఒక గ్రూప్లోనివారు సురక్షితంగా చేరగా, మరో గ్రూప్ సభ్యులు ప్రయాణిస్తున్న విమానం అదృశ్యమైంది. అప్పట్లో వీరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీంతో క్రీడాకారులు మరణించినట్టుగా భావించి సంతాప కార్యక్రమాన్నిఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ సంఘటన గురించి అందరూ మరచిపోయారు. ఐదు దశాబ్దాల తర్వాత అదృశ్యమైన విమానం మిస్టరీ వీడింది.




