దమ్మున్న నాయకుడు మోడీ : దత్తాత్రేయ
ప్రాంతాలుగా కలిసుందాం : విద్యాసాగర్
మోడీవైపే చూస్తోంది : కిషన్‌రెడ్డి
త్రీడీ మోడీ : వెంకయ్య
హైదరాబాద్, ఆగస్టు 11
(జనంసాక్షి) :
దేశ ప్రగతికి తెలుగువారి కృషి ప్రశం సనీయం.. శాంతిసౌభాగ్యాలతో వర్ధిల్లా లని ప్రార్థిస్తున్నాను.. క్లిష్ట పరిస్థితుల నుండి ప్రజలు బయటకు రావాలని కోరు కుంటున్నాను.. కేంద్ర, రాష్ట్రంలోని కాం గ్రెస్ పార్టీకి సద్బుద్ధి కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తన ప్రసంగాన్ని తెలుగులో ఆరంభించి అందర్ని ఆకట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఎల్‌బిస్టేడియంలో నవభారత్ యువభేరి బహిరంగ సభలో ఆయన తన ప్రసం గాన్ని ఇలా కొనసాగించారు. పెద్ద సంఖ్య లో విచ్చేసిన యువతను అభినందిస్తున్నా నన్నారు. ఐదు రూపాయల రశీదుతో సభకు తరలిరావడం అభినందనీయ మన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియ జేస్తున్నానన్నారు. సభకు విచ్చేసిన వారిని స్వయంగా చూడగలుగుతున్నానని అన్నా రు. లోపలికి రాలేని వారిని క్షమించమని వేడుకుంటున్నానన్నారు. టీవీలు, స్క్రీన్లు ద్వారా మీరు నన్ను చూడగలుగుతున్నారు. నేను వారిని చూడలేకపోతున్నాను, మరోమారు ఆంధ్రప్రదేశ్‌కు వస్తానని, అందర్ని కలుసుకుంటానని అన్నారు. దేశ యువత భరోసా కోసం ఎదురు చూస్తోందన్నారు. పాకిస్థాన్ సైనికులు మన సైనికులను హతమారుస్తుంటే దేశం మౌనంగా ఉందన్నారు. సర్కారు ఎందుకు స్పందించడం లేదో బదులివ్వాలన్నారు. కాశ్వీర్‌లో బాధితులను పరామర్శించేందుకు భారతీయ జనతాపార్టీ అగ్రనేత అరుణ్‌జైట్లీ వెళుతుంటే ఆయనను నేడు ఎయిర్‌పోర్టులోనే అడ్డుకోవడం విచారకరమన్నారు. జమ్మూకాశ్మీర్‌లో శాంతిభద్రతలను కాపాడడంలో ఉమర్ అబ్దుల్లా విఫలమయ్యారని అన్నారు. దేశంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. యువతకు భరోసా లేదు. కాంగ్రెస్ పార్టీ విభజించు – పాలించు అన్న సూత్రాన్ని అమలు చేస్తోంది. ఆంధ్ర ఎంపీలవల్లే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మనగలుగుతోందన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో ఉత్తరాంచల్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, అవి నేడు అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నాయని అన్నారు. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నాం.. పదేళ్ళ పాటు సీమాంధ్రులకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని, తర్వాత కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం బాగోలేదన్నారు. 2004లోనే కొత్త రాజధాని ఏర్పాటుచేస్తే ఇప్పుడు ఏ సమస్య ఉండేది కాదన్నారు. సీమాంధ్రలో రాజధాని ఏర్పడితే హైదరాబాద్ కంటే అభివృద్ధి చెందుతుందన్నారు. సీమాంధ్ర ప్రాంత అభివృద్ధికి బిజెపి సహకరిస్తుందన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు సోదరులవలె జీవించాలని అన్నారు. తెలంగాణ ఎంత ముఖ్యమో సీమాంధ్ర ప్రాంతం కూడా తమకు అంతే ముఖ్యమని చెప్పారు. అన్నదమ్ముల్లాంటి మీ మధ్య బిజెపి చిచ్చుపెట్టబోదని హామీనిచ్చారు. గుజరాత్‌లో మాదిరిగా తెలంగాణను, సీమాంధ్రను అభివృద్ధి చేయాలన్నదే తమ తపన అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంవల్ల దేశ అభివృద్ధి 60 ఏళ్ళు వెనక్కు వెళ్ళిందన్నారు. ఓట్లు పోతాయనే ఉద్దేశంతోనే యుపిఎ ప్రభుత్వం ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తోందన్నారు. గుజరాత్‌లో ఎందరో తెలుగువారు సుఖసంతోషాలతో జీవిస్తున్నారన్నారు. భారతదేశానికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరనీయమైనవని అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన మహానుభావుడని అన్నారు. ఎన్టీఆర్‌వల్లే ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ నుంచి దేశానికి విముక్తి కల్పించడమే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని అన్నారు. కాంగ్రెస్‌ను పారదోలేందుకు యువత, రైతులు చేయిచేయి కలిపారన్నారు. అభివృద్ధి ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలు నేడు అన్ని రంగాల్లోనూ అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నాయన్నారు. గుజరాత్ మాదిరిగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే తమ స్వప్నమని అన్నారు. గుజరాత్‌ను వదిలేసి తమిళనాడును చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ డెవెలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో ఏ పేదవాడు కూడా తిండి కోసం బాధ పడలేదన్నారు. సకల సమస్యలకు కాంగ్రెస్ పార్టీయే నిలయమన్నారు. ఆహార భద్రత బిల్లు తేవాల్సిన దుర్గతి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టిందన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. దేశంలో కాంగ్రెస్ శకం ఇక ముగిసిందన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ నుంచి విముక్తి కోరుకుంటున్నారని అన్నారు. అవినీతితో దేశ ప్రతిష్టను భ్రష్టు పట్టించిందన్నారు. గాలి, ఆహారం, నీరు, బొగ్గు అన్నింటిలోనూ కుంభకోణాలకు నిలయంగా మారిందన్నారు. దేశ యువత మార్పు కోరుకుంటోందన్నారు. దేశ ప్రజలు బిజెపికేసి చూస్తున్నారన్నారు. బిజెపియే తమ జీవితాలకు భరోసా అని యువత భావిస్తోందన్నారు. జై తెలంగాణ.. జై సీమాంధ్ర.. భారత్ మాతాకీ జై.. వందే.. వందే.. వందే.. అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. ఇదిలా ఉండగా, ఎల్‌బి స్టేడియంలోని యువభేరి వేదికపై నుంచి తొలుత యువతనుద్దేశించి ఆ పార్టీ సీనియర్ నేతలు లక్ష్మణ్, విద్యాసాగరరావు, మురళీధర్‌రావు, బండారు దత్తాత్రేయ, వెంకయ్య నాయుడు, కిషన్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు.
డైనమిక్ లీడర్ నరేంద్రమోడీ : దత్తాత్రేయ
దేశ భవితను మార్చే డైనమిక్ లీడర్ నరేంద్రమోడీ అని బండారు దత్తాత్రేయ అన్నారు. దేశంలోని యువత భవితను అందంగా తీర్చిదిద్దగలిగేది నరేంద్రమోడీయేనని అన్నారు. నరేంద్రమోడీకి బాసటగా నిలవండి నవభారత నిర్మాణాన్ని సాకారం చేసుకోండి అని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్‌పార్టీని భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. బిజెపి అధికారంలోకి రావడం తధ్యమన్నారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రాంతాల వారీగా విడిపోయారన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలు రావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వమనేది లేదని దుయ్యబట్టారు.
మనమంతా కలిసుందాం : విద్యాసాగరరావు
రానున్నది ఎన్‌డిఎ ప్రభుత్వమేనని కేంద్ర మాజీమంత్రి విద్యాసాగరరావు అన్నారు. తెలుగు వారమంతా కలిసి ఉందామని పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ఒకే సెల్‌లోని రెండు సిమ్‌లవలె కలిసి ఉందామని ఉన్నారు.
మోడీకేసీ చూస్తోంది : కిషన్‌రెడ్డి
దేశ ప్రజలు, ముఖ్యంగా యువత నరేంద్రమోడీకేసి చూస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఉందన్నారు. ఏ పార్టీ ఉంటుందో, ఏ పార్టీ ఊడుతుందో తెలియని అనిశ్చిత స్థితి ఉందన్నారు. 2009 నుంచి చూస్తూనే ఉన్నామన్నారు. విభజనవల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరి ఇష్టమొచ్చిన విధంగా వారు మాట్లాడుతున్నారని అన్నారు. 2014కు ఏ పార్టీ ఉంటుందో, ఏ నాయకులు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. దేశంలో నరేంద్రమోడీయే కేంద్రబిందువుగా మారారన్నారు. 15 రోజుల నుండి సిఎం సచివాలయానికే రాలేదన్నారు. ఇంటి వద్దనుంచే పాలన కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పాలనే లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు తలో విధంగా మాట్లాడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ రెండు నాల్కల ధోరణితో కొనసాగుతోందన్నారు. హైదరాబాద్‌లో రౌడీలు పెరిగిపోయిందన్నారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు.
యువతతోనే దేశాభివృద్ధి సాధ్యం
నా పథకాలే పనిచేస్తున్నాయి : మోడీ
అభివృద్ధి చెందాలంటే అది యువత చేతిలోనే ఉందని, దమ్మున్న యువతను ప్రోత్సహించినపుడే అభివృద్ధిపథంలో ముందుకు వెళతామని గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ఎన్నికల రథసారధి నరేంద్రమోడీ అన్నారు. నగరంలో జరిగే ‘నవభారత యువభేరి’ బహిరంగ సభలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా పార్క్‌హోటల్‌లో తనను కలిసిన సినీ ప్రముఖులతో వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రిగా పనిచేయడం లేదని, తాను ఏర్పరచిన వ్యవస్థ, మౌలిక సదుపాయాలు పని చేస్తున్నాయని, తద్వారా గుజరాత్ అభివృద్ధిపథంలో ముందుకు వెళుతుందన్నారు. సిఎంగా తాను సాధించిన విజయం ఆరుకోట్ల గుజరాత్ ప్రజలదన్నారు. మహారాష్ట్ర నుండి గుజరాత్ విడిపోయినపుడు గుజరాత్ పని అయిపోయిందని, ఆ రాష్ట్రం వెనకబడిపోతుందని అందరూ అన్నారని, కాని నేడు గుజరాత్ అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా మోడీ గుర్తుచేశారు. పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఏ ప్రాంతం నష్టపోదని, ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, అందుకు యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన వారికి సూచించారు. భవిష్యత్‌లో కూడా దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళే లక్ష్యంతో తాను ఈ యాత్రను చేపట్టినట్లు చెప్పారు. ఎవరి రంగంలో వారు దృష్టి పెడితే దేశం తానంతట అదే అభివృద్ధి చెందుతుందన్నారు. సత్తా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉత్తేజం కల్పించి దేశాభివృద్ధి వైపు దృష్టి మళ్ళించడానికి తాను ఈ యాత్రను హైదరాబాద్ నుంచి ప్రారంభించాలని భావించి వచ్చానన్నారు. గుజరాత్‌లో 30 శాతం మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ వారు ఉన్నారని అన్నారు.





