గ్రాంటు పెంచండి


స్థానిక సంస్థలకు 40 శాతం వాటా ఇవ్వండి
14వ ఆర్థిక సంఘానికి సీఎం కిరణ్‌ వినతి
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) :
రాష్ట్రంలో సమస్యలు ఉన్నా పెట్టుబడులు, అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి రాష్టాన్రికి వచ్చే పన్నుల వాటాను పెంచాలని, జాతీయ విపత్తు నష్టాన్ని కేంద్రమే భరించాలని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని జూబ్లీహాల్‌లో 14వ ఆర్థిక సంఘం ప్రతినిధుల బృందంతో సీఎం కిరణ్‌, మంత్రులు, ఉన్నతాధికారులు తదితరులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కిరణ్‌ వారికి వివరించారు. వివిధ వర్గాలకు చెందిన వారి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో నాలుగు జిల్లాలు మాత్రమే తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పన్నుల వాటా 40 శాతానికి పెంచేలా సిఫార్సు చేయాలని ఆర్థిక సంఘం ప్రతినిధులను కోరారు. కేంద్ర పన్నుల్లో 40 శాతం వాటా ఇవ్వాలని, జాతీయ విపత్తు నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలని కోరారు. 1971 జనాభా లెక్కల ప్రకారం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సాధారణ పన్నులపై వెసులుబాటు కల్పించాలని, భారీగా నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్‌పై ఒత్తిడి తగ్గించేలా కేంద్రం నిధుల విడుదల ఉండాలని అభిప్రాయపడ్డారు. కేంద్ర సేవల పన్ను (సీఎస్‌టీ) విధానం అమలయ్యేలోగా రాష్టాన్రికి రావాల్సిన గ్రాంట్‌ ఇవ్వాలని, స్థానిక సంస్థలకు కేంద్ర గ్రాంట్‌ పెంచాలని విజ్ఞప్తి చేశారు. విపత్తు నివారణ కోసం రాష్ట్రం ప్రభుత్వం ఇస్తున్న పరిహారాల్లో కేంద్రం వాటా తక్కువగా ఉంటోందని తెలిపారు. రాయితీల భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపై వదిలివేయడం సరికాదని పేర్కొన్నారు. నిధుల వాటా నిర్ణయానికి తలసరి ఆదాయం మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం సమంజసం కాదని ఆర్థిక సంఘం ప్రతినిధుల బృందం దృష్టికి తీసుకొచ్చారు. అభివృద్ధి రేటులో, జనాభా సంఖ్య, ఇతర ప్రామాణికాల ఆధారంగా ఆర్థిక సంఘం సిఫార్సులు చేస్తుండడంతో రాష్టాన్రికి కేటాయింపులు తగ్గిపోయానని చెప్పారు. కేంద్రం నుంచి పన్నుల వాటాను 35 శాతానికే పరిమితం చేయడంతో  రాష్ట్రం భారీగా నష్టపోయిందని వివరించారు. 2, 3 ఆర్థిక సంఘాల సిఫార్సుల్లో రాష్టాన్రికి కేంద్రం వాటి తగ్గిపోతూ వస్తోందని ఫలితంగా 20 వేల కోట్లను రాష్ట్రం నష్టపోయిందని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లోనైనా రాష్టాన్రికి సరైన వాటా లభించేలా చూడాలని, కనీసం 40 శాతం పన్నుల వాటా లభించేలా సిఫార్సు చేయాలని కిరణ్‌ విజ్ఞప్తి చేశారు.
ప్రతిపాదనలు సమర్పించిన ఆర్థిక శాఖ
14వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ఆర్థిక శాఖ పలు ప్రతిపాదనలు సమర్పించింది. రూ.30,425.78 కోట్లు గ్రాంటుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేలా సిఫార్సు చేయాలని ఆర్థిక శాఖ 14వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేసింది. షెడ్యూల్డ్‌ ప్రాంతాల అభివృద్ధికి రూ.11,153 కోట్లు, న్యాయ పరిపాలన పటిష్టత కోసం రూ.2,936 కోట్లు, రహదారులు, వంతెనల నిర్మాణానికి రూ.3 వేల కోట్లు, గ్రామాల్లో తాగు నీటి కోసం రూ.2,637 కోట్లు, అడవుల నిర్వహణకు రూ.1,259 కోట్లు, గిరిజనుల అభివృద్ధికి రూ.1250 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది. సాధ్యామైనంతగా ఎక్కువ నిధులు ఇచ్చేలా సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేసింది.

తాజావార్తలు