
ఆ నలుగురి నియామకం చెల్లదు
కొత్తవారిని నియమించండి
ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (జనంసాక్షి) :
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన అనుయాయులకు పట్టం కట్టిన ముఖ్యమంత్రికి శృంగభంగమైంది. సాక్షాత్తు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చెప్పినా వినిపించుకోకుండా పంతం పట్టిన సీఎంకు హైకోర్టులో షాక్ తగిలింది. నలుగురు సమాచార కమిషనర్ల నియామకాన్ని హైకోర్టు తప్పుబట్టింది. సమాచార కమిషనర్లుగా తాంతియా కుమారి, వెంకటేశ్వర్లు, విజయనిర్మల, ఇంతియాజ్ నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది. నలుగురు సమాచార కమిషనర్ల నియామకాన్ని రద్దు చేసి, వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ఆదేశించింది. సమచార కమిషనర్‌గా వెంకటేశ్వర్లు నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారించిన హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ఈ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సర్కారుకు మొట్టికాయలు వేసింది. గవర్నర్ వద్దని చెప్పినా ఎందుకు వీరిని నియమించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆ నలుగురి నియామకాలపై పునఃసవిూక్షించి, కొత్తగా నియామక ప్రక్రియను చేపట్టాలని ఆదేశించింది. సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా వెంకటేశ్వర్లు, తాంతియాకుమారి, ఇంతియాజ్ అహ్మద్, విజయనిర్మల నియాకాలు రాజకీయ జోక్యంతో జరిగినట్లుగానే కనిపిస్తోందని, ఇప్పటివరకు కూడా తమకు రాజకీయాలతో సంబంధం లేదంటూ వారు స్పష్టంగా చెప్పలేకపోయారని హైకోర్టు వ్యాఖ్యానించింది. వీరి నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్ తిప్పిపంపినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ పిటిషనర్లు చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. దీంతో కిరణ్ సర్కారు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్తుందా? లేక కోర్టు నియామకాన్ని అమలు చేస్తుందా? అన్నదానిపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. కీలకమైన సమాచార కమిషనర్లుగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇటీవల తన అనుయాయులను నియమించారు. రాజకీయాలకు అతీతమైన పదవుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిని కూర్చోబెట్టారు. మొత్తం ఎనిమిది మంది పేర్లను గవర్నర్‌కు సిఫార్సు చేశారు. విజయ్‌బాబు, ప్రభాకర్, మధుకర్‌రాజు, రతన్‌తో పాటు రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న తాంతియాకుమారి, విజయనిర్మల, వెంకటేశ్వర్లు, ఇంతియాజ్‌ను సమాచార కమిషనర్లుగా నియమిస్తూ గవర్నర్ ఆమోదానికి పంపించారు. ఈ నియామకంపై అప్పట్లోనే ప్రభుత్వంపై విమర్శలు చెలరేగాయి. రాజకీయ పక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఆ నలుగురు కాంగ్రెస్ నాయకులని, సమాచార కమిషన్‌కు సంబంధించిన అనుభవం లేని వారని మండిపడ్డాయి. మరోవైపు, గవర్నర్ నరసింహన్ కూడా ఈ నియామకాలను తొలుత తిరస్కరించారు. విజయ్‌బాబు, ప్రభాకర్, మధుకర్‌రాజు, రతన్ నియామకాన్ని ఆమోదించిన నరసింహన్ మిగతా నలుగురి ఎంపికపై పునరాలోచించాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలతో సాన్నిహిత్యం ఉన్న వారిని సమాచార కమిషనర్లుగా నియమించడం సరికాదని.. వారి నియామక ఫైల్‌ను తిప్పిపంపారు. మరోసారి పునఃపరిశీలన చేయాలని ప్రభుత్వానికి సూచించారు. అయితే, పట్టు వీడని ముఖ్యమంత్రి గవర్నర్ ఆదేశాలను పెడచెవిన పెట్టారు. మరోమారు అదే ఫైల్‌ను గవర్నర్‌కు పంపించి, వారి నియామకాలకు ఆమోద ముద్ర వేయాలని సిఫార్సు చేశారు. చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకొని సీఎం మళ్లీ ఫైలును పంపించడంతో గవర్నర్ ఆమోదముద్ర వేయక తప్పలేదు.అయితే, సమాచార కమిషనర్లుగా రాజకీయ నాయకులను నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నలుగురు సమాచార కమిషనర్ల నియామకంపై విశ్రాంత ఐఏఎస్ అధికారి పద్మనాభరెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రాజకీయ నాయకులను సమాచార కమిషనర్లుగా నియమించడం రాజ్యాంగ వ్యతిరేకమని, స.హ. చట్టం స్ఫూర్తికి విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. గవర్నర్ నరసింహన్ తిరస్కరించిన వారినే మళ్లీ నియమించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం.. ఆ నలుగురు నియామకాలను తప్పుబడుతూ గురువారం తీర్పు వెలువరించింది. ఆ నియామకాన్ని పునఃసమీక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
కిరణ్ సర్కార్‌కు హైకోర్టు చెంపపెట్టు




