భాజపా ప్రధాని అభ్యర్థిగా మోడీ

సమావేశానికి అద్వానీ డుమ్మా
రాజ్‌నాథ్‌కు లేఖ
నన్ను ఆశీర్వదించండి : మోడీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13 (జనంసాక్షి) :
ఎట్టకేలకు భాజపా ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్రమోడీని ప్రకటించారు. అద్వానీ అయి ష్టత వ్యక్తం చేసినా ఆర్‌ఎస్‌ఎస్ ప్రోద్బలంతో బీజేపీ పార్లమెంటరీ బోర్డు మోడీ పేరును ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఈ ప్రకటన చేయగా పలువురు సీనియర్ నేతలు హర్షామోదం తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటిస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు రాజ్‌నా థ్‌సింగ్ తెలిపారు. పార్లమెంటరీ బోర్డు కార్యాల యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో మోడీ అభ్యర్థిత్వాన్ని పార్లమెంటరీ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. మోడీ అభ్యర్థిత్వంపై పార్టీ పార్లమెంటరీ బోర్డు విసృతంగా చర్చించిందని ఆయన తెలిపారు. ఎన్డీయేలోని రాజకీయపక్షాలు కూడా మోడీకి మద్దతు ఇచ్చినట్టు రాజ్‌నాథ్ ప్రకటించారు. నరేంద్రభాయ్ మోడీ నేతృత్వంలో ఎన్డీయే 2014 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తంచేశారు. ప్రజలు మోడీ నాయకత్వంలో ఎన్డీయేను ఆదరించాలని ఆయన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాజపా ప్రధాని అభ్యర్థిత్వంపై భాజపా పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకోనుంది. పార్టీలోని కీలకనేతలు నరేంద్రమోడీకి మద్దతివ్వడంతో పాటు సంఘ్‌పరివార్ కూడా మొగ్గు చూపడంతో మోడీ అభ్యర్థ్వితం లాంఛనప్రాయమే. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, గడ్కరీ, మురళీమనోహర్‌జోషీ, సుష్మాస్వరాజ్, అనంతకుమార్ తదితరులు హాజరయ్యారు. బీజేపీలో చిన్న కార్యకర్తగా ప్రారంభమైన తనను 2014 ఎన్నికల్లో పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంపై గుజరాత్ సీఎం నరేంద్రమోడీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్త ఆశలతో పార్టీని కాశ్మీరంనుంచి కన్యాకుమారి వరకు విజయం వైపు నడిపిస్తాన్నారు. సామాన్యుల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీని నడిపిస్తానన్నారు. పార్టీ తనకు అప్పగించిన గురుతర బాధ్యత నెరవేర్చేందుకు దేశ ప్రజల ఆశీస్సులు కోరుకుంటున్నట్టు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా బిజెపి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. పలుచోట్ల బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. బీజేపీ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. అయితే మోడీ అభ్యర్థిత్వాన్ని ముందు నుంచి వ్యతిరేకించిన అద్వానీ చివరకు మళ్లీ తన అయిష్టతను వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీ పేరును తుది రారు చేసే క్రమంలో భాజపాకు అగ్రనేత ఎల్‌కే అద్వానీ నుంచి అడ్డంకులు తొలగిపోలేదు. ఈ విషయంలో అద్వానీకి నచ్చజెప్పే ప్రయత్నాలు ముమ్మరంగా సాగాయి. చివరకు ఆయన పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌కు సైతం రాకుండా రాజ్‌నాథ్‌కు లేఖరాశారు. మోడీ అభ్యర్థిత్వంపై ఒప్పించేందుకు కోసం రాజ్‌నాథ్‌సింగ్ అద్వానీతో 30 నిమిషాలపాటు ప్రత్యేకంగా సమావేశం జరిపినా హామీ సాధించడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ దూతగా మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ మంగళవారం ఇదే కార్యంపై అద్వానీని కలిసినా, ఖాళీ చేతులతో తిరిగొచ్చారు. పరిస్థితులను ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు వివరించారు. మోడీ అభ్యర్థిత్వంపై ఎలాంటి వివాదం లేదనీ, పేరును ప్రకటించే సమయాన్ని బీజేపీ నిర్ణయిస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ ముందే స్పష్టం చేసింది. ఏకాభిప్రాయ సాధన ద్వారా పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుందని అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది పేర్కొన్నారు. మోడీ పేరును ఏకగ్రీవంగా ప్రకటించాలనే ఉద్దేశంతో రాజ్‌నాథ్‌సింగ్ ఉన్నట్లు ముందే వార్తలు వెలువడ్డాయి. సంఘ్ పరివార్ అగ్రనాయకత్వం ఇందుకు పచ్చజెండా చూపడమేగాక ఒత్తిడి కూడా తెచ్చింది. కానీ, ఈ మేరకు ప్రతిపాదించాల్సిన ఎల్.కె.అద్వానీ మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈ ప్రతిపాదనను సమర్థించారు. మోదీ పేరు ప్రకటనలో ఏమాత్రం జాప్యం చేసినా 2014 ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు దెబ్బతింటాయని మరో ఇద్దరు సీనియర్లు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డట్లు సమాచారం.
సమావేశానికి అద్వానీ గైర్హాజరు.. రాజ్‌నాథ్‌కు లేఖ
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ఆ పార్టీ అగ్రనేత అద్వానీ హాజరుకాలేదు. ప్రధాని పదవికి అభ్యర్థిగా మోడీని ప్రకటించేందుకు ఆయన విముఖత చూపుతున్నట్టు తెలిసింది. అందుకే ఆయన గైర్హాజరయ్యారు. అలాగే భాజపా అగ్రనేత అద్వానీ ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాశారు. పార్టీ పరిణామాలపై తాను నిరాశ చెందినట్టు ఆయన తన లేఖలో పేర్కొన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తాను కలత చెందడం వల్లనే పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి హాజరుకాలేదని ఆయన తెలిపారు. రాజ్‌నాథ్ పనితీరుపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గోవా సమావేవాలకు ముందు కూడా అద్వానీ ఇలాగే వ్యవహరించారు. దీంతో ఆయన ప్రకటన ఒకింత ఆలస్యం అయ్యింది, అయితే ఈ పరిస్థితి బయటపడకుండా రాజ్‌నాథ్ జాగ్రత్త పడ్డారు. పార్టీ అగ్రనేత అద్వానీ నివాసానికి మోడీ వెళ్లి ఆశీస్సులు తీసుకుంటారని రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి నివాసానికి కూడా మోడీ వెళ్లనున్నట్టు ఆయన వెల్లడించారు ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించడంపై ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశంలో సీనియర్ నేత అద్వానీని ఒప్పంచేయత్నం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పార్టీ సారథుల్లో ఒకరైన అద్వానీని పక్కన పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు.



