మురికి వాడల నిర్మూలన సర్కారు ధ్యేయం

జేఎన్ అర్బన్ రెన్యూవల్ మిషన్ స్కీం ప్రారంభించిన ప్రధాని
చండీఘడ్, సెప్టెంబర్ 14 (జనంసాక్షి) :
మురికి వాడల నిర్మూలనే యూపీఏ ప్రభుత్వ ధ్యేయమని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. శనివారం చండీఘడ్‌లోని మురికి వాడల్లో గల ప్రజల పునరావాసం కోసం దనాస్ ప్రాంతంలో రూ.2,400 కోట్లతో జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్భన్ రెన్యూవల్ స్కీం కింద నిర్మించిన భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పది మంది లబ్ధిదారులకు గృహాలను స్వాధీనం చేశారు. నగర శివారులో నిర్మించిన 8,448 ప్లాట్లను త్వరలోనే లబ్ధిదారులకు కేటాయిస్తామని తెలిపారు. ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లోని మురికివాడల్లో నివసిస్తున్న 25 వేల కుటుంబాలను గుర్తించామని తెలిపారు. మొదట 20 ఏళ్ల పాటు ప్లాట్లని లీజుకు ఇస్తామని, కాలపరిమితి అనంతరం వారికే ఇంటిని అప్పగిస్తామని తెలిపారు. ప్రాజెక్టులో మంచినీటి ప్లాంట్, పాఠశాల, పోలీస్‌స్టేషన్, విద్యుత్, మురికినీటిని శుద్ధి చేసే ప్లాంట్, ఆస్పత్రి తదితర సౌకర్యాలన్నీ కల్పించినట్లు చెప్పారు. 50 వేల మంది ఇక్కడ ఆవాసం పొందే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ శివరాజ్ పాటిల్, పంజాబ్, హర్యానా గవర్నర్ పహాడియా, ముఖ్యమంత్రులు ప్రకాశ్‌సింగ్ బాదల్, భూపేందర్‌సింగ్ హుడా, ఎంపీ పవన్‌కుమార్ బన్సల్ తదితరులు పాల్గొన్నారు.



