తెలంగాణ మంత్రులు అట్టోల్లే : కేకే


ఒక్క రూపాయి ఇవ్వనన్నా పడున్నరు
హైదరాబాద్‌ భూములపైనే సీమాంధ్రులకు ప్రేమ : వివేక్‌
హైదరాబాద్‌,
సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రాంత మంత్రులపై టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె.కేశ వరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వారు అట్టోల్లేనని, దద్దమ్మలు, చవటలు అని విరుచుకుపడ్డారు. తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వనని సీమాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా స్పందించని దద్దమ్మలు తెలంగాణ మంత్రులు అని నిప్పులు చెరిగారు. తెలంగాణ భూములను కబ్జా చేసిన సీమాంధ్ర నాయకులు వాటి కోసమే రాష్ట్ర విభజనను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ కాలేజీలో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేకే.. ఆవేశంగా ప్రసంగించారు. హైదరాబాద్‌లో అన్ని వ్యాపారాలు సీమాంధ్రుల చేతుల్లో కేంద్రీకృతమయ్యాయని ధ్వజమెత్తారు. షాపింగ్‌ మాల్స్‌, అపార్ట్‌మెంట్లు, విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ వారి చేతుల్లోనే ఉన్నాయని విమర్శించారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భూములను చెరపట్టిన సీమాంధ్ర నాయకులు వాటి కోసమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తాము విడిపోతామన్నా కలిసుండాలని సీమాంధ్రులు పట్టుబట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ కోసం వందల మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే దానిపై పార్లమెంట్‌ స్పందించక పోవడం దురదృష్టకరమని అన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులు గట్టిగా నిలబడితే ఇన్ని ఆత్మహత్యలు జరిగేవే కావన్నారు. పదవులను వదులుకొనేందుకు వారు సిద్ధపడితే ఎప్పుడో తెలంగాణ ఏర్పాటయ్యేదని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మంత్రులు ఎందుకు నోరు తెరవరని ప్రశ్నించారు. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రూపాయి కూడా ఇవ్వనంటే దద్దమ్మల్లా కూర్చున్నారని మండిపడ్డారు. ఇప్పుడేదో తమ వల్లే సీడబ్ల్యూసీ ప్రకటన వచ్చిందని జబ్బలు చరుచుకుంటున్నారని.. సభల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసే వరకూ ఆ పార్టీని నమ్మలేమన్నారు. గతంలోనూ డిసెంబర్‌ 9న ప్రకటన చేసి, ఆ తర్వాత వెనక్కు పోయిందని ఈసారి కూడా అలాంటి పరిస్థితి తలెత్తే ప్రమాదముందని హెచ్చరించారు. కేంద్రం తెలంగాణపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యే వరకూ అందరం అప్రమత్తంగా ఉండాలని, ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయమని ఎంపీ వివేక్‌ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. సింగరేణికి వచ్చే లాభాల్లో 25శాతాన్ని కార్మికులకు బోనస్‌గా ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరుతున్నామన్నారు. దసరా పండుగ లోపే తుది నిర్ణయం తీసుకోవాలని డిమాండు చేశారు. సీఎం కిరణ్‌ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి వలె కాకుండా సీమాంద్ర ప్రాంతానికే సీఎంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు వ్యతిరేకి అన్న విషయాన్ని తాను ఎప్పుడో గుర్తించానన్నారు. ఆయన కూడా చాలాసార్లు ఆ విషయాన్ని బయట పెట్టుకున్నా రన్నారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వబోనని స్వయంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అలాగే జులై 30న నిర్ణయం వెలువడిన తరువాత మీడియాతో మాట్లాడుతూ మరోమారు తన సమైక్య వాదాన్ని బయట పెట్టుకున్నారని అన్నారు. ఎవరూ అడ్డుకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఆగబోదని స్పష్టం చేశారు. తెలంగాణ ఇస్తామని 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. విడిపోవడం వల్ల ఆంధ్ర ప్రాంతానికి ఎటువంటి అన్యాయం జరగ బోదన్నారు. ఇప్పటికే అపార వనరులున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా అదనంగా నిధులు ఇచ్చి సహకరిస్తుందని అన్నారు. తెలంగాణకు అనుకూలమని అన్ని పార్టీలు చెప్పాకే కాంగ్రెస్‌పార్టీ తుది నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తుది నిర్ణయం తీసుకున్న తరువాత కొన్ని పార్టీలు యు-టర్న్‌ తీసుకున్నారని ఆరోపించారు. ఎవరెన్ని చేసినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయమని అన్నారు. సీమాంధ్ర ప్రాంత బడా వ్యాపారులకు హైదరాబాద్‌పైనే ప్రేమ ఉందన్నారు. హైదరాబాద్‌లోని భూముల కోసమే వారు పేచీ పెడుతున్నారన్నారు. హైదరాబాద్‌లో 97 కంపెనీలు పెట్టుబడులు పెడితే వాటిల్లో 78 అంతర్జాతీయ కంపెనీలే ఉన్నాయని తెలిపారు.

తాజావార్తలు