మక్కా మసీదు బాధితుల తీర్పుపై హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) :మక్కా మసీదు బాంబు పేలుడుకు సంబంధించి అక్రమంగా అరెస్టు చేసిన యువకులకు చెల్లించిన నష్టపరిహారంపై ఈ నెల 16న తాము జారీచేసిన ఉత్తర్వులలో లోపాలు ఉన్నందున దాని అమలును నిలిపివేస్తున్నట్లు హైకోర్టు గురువారం ప్రకటించింది. బాంబు పేలుడుకు సంబంధించిన కేసులో అక్రమంగా అరెస్టు చేసిన యువకులకు చెల్లించిన నష్టపరిహారాన్ని తరిగి రాబట్టాలని, తదుపరి చెల్లింపులు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గత సోమవారం చీఫ్‌ జస్టిస్‌ కల్యాణ్‌ జ్యోతి సేన్‌ గుప్తా, జస్టీస్‌ కెసి భానులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. అయితే తాము జారీచేసిన ఉత్తర్వులో కొన్ని తప్పులు దొర్లినందున ఆ ఉత్తర్వు అమలును నిలిపివేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. లబ్ధిదారులందరికీ నోటీసులు జారీచేసి ఈ కేసు తదుపరి విచారణను 15 రోజుల తర్వాత వేయాలని కోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. లబ్ధిదారులు తమ వాదనను వినిపించుకునే అవకాశం ఇవ్వాలని, అప్పటి వరకు చెల్లించిన నష్టపరిహారాన్ని రాబట్టే ప్రక్రియను నిలిపివేయాలని కోర్టు నిర్ణయించింది.

తాజావార్తలు