Wednesday, 4 November 2026

విభజనపై పార్టీలది అదే పాట హిందూపత్రిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం

రాష్ట్ర విభజనపై ఎవరిదారి వారిదే

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21 : రాష్ట్ర విభజనపై పార్టీలు మళ్లీ పాత పాటే పాడాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీపీఎం ఎప్పటిలాగే వ్యతిరేకించగా.. సీపీఐ, టీఆర్‌ఎస్‌, బీజేపీలు పూర్తి మద్దతు ప్రకటించింది. స్పష్టత లేకుండా నిర్ణయం ప్రకటించడంపై లోక్‌సత్తా అభ్యంతరం తెలిపింది. అయితే ప్రస్తుత అనిశ్చితికి అన్ని పార్టీల ద్వంద్వ వైఖరే కారణమని నిందించింది. రాష్ట్ర ఏర్పాటు అనివార్యమని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం చెప్పారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయా పార్టీల నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే..

విభజనకు మేం వ్యతిరేకం: సీపీఎం

రాష్ట్ర విభజనకు సీపీఎం వ్యతిరేకమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు స్పష్టం చేశారు. శనివారం రాష్ట్ర విభజనపై హిందూ దినపత్రిక నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అనిశ్చితికి రాజకీయ పార్టీలే కారణమని ఆరోపించారు. విభజన జరిగినా సమస్యలు పరిష్కారం కావన్నారు. విభజనపై ఎలాంటి  అధ్యయనం, ప్రణాళిక రూపొందించకుండానే   కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ విభజనకు నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి రాజకీయంగా పరిష్కారం కావాలి తప్ప వేరే మార్గం లేదన్నారు. నీటి పంపకాలు, హైదరాబాద్‌ రాజధాని, ఉద్యోగుల సమస్యలు, రాష్ట్ర విభజన జరిగినా ఉంటాయని ఆయన వివరించారు. సమైక్యంగా ఉంచితేనే ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పారు. రాజకీయ లబ్ది కోసం అన్ని పార్టీలు విభజన అంశంపై గందరగోళం సృష్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్రాలను విభజించుకుంటూ పోతే ప్రజాస్వామ్యానికి , దేశ సమైక్యతకు, లౌకికవాదానికి ముప్పు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్యవాదమే సీపీఎం నినాదమని చెప్పారు.

తెలంగాణకు కట్టుబడి ఉన్నాం: సీపీఐ

సీసీఐ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సీపీఐ అంగీకారం తెలిపిందన్నారు. 1956 నుంచే తెలంగాణ సమస్య ఉందని, పెద్దమనుషుల ఉల్లంఘించడంతోనే ఈ సమస్య జటిలమైందన్నారు. తెలంగాణ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించేందుకు విడుదల చేసిన 610జీవో కూడా సక్రమంగా అమలు కాలేదన్నారు. రెండో ఎస్సార్సీకి తమ పార్టీ వ్యతిరేకమన్నారు. విభజనకు అన్ని పార్టీలు అంగీకరించాయని, ఇప్పుడు మాట తప్పడంవల్లే ప్రజలు గందరగోళంలో పడ్డారని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగినా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని నారాయణ చెప్పారు. విభజనపై ప్రజలను అన్ని పార్టీలు మోసం చేశాయని ఆయన విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఈ అనిశ్చితికి అన్ని పార్టీలే కారణం: లోక్‌సత్తా

లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్‌ నారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావన్నారు. వివిధ రాజకీయ పార్టీల వికృత ఆటల వల్లే రాష్ట్ర విభజన సమస్య జటిలమైందన్నారు. ఎకానమి, రెవెన్యూ భద్రతపై ఎలాంటి స్పష్టత లేకుండానే సీడబ్ల్యుసీ రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవడం విడ్డూరమని ఆయన పేర్కొన్నారు. సరైన మెకానిజం లేకుండానే సమస్యలు ఎలా పరిష్కరిస్తాని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతోందని, సీమపై కూడా కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదన్నారు. హైదరాబాద్‌పై కేంద్రం నోరు మెదపకపోవడం వల్లే అన్ని ప్రాంతాల ప్రజలు తీవ్ర గందరగోళంలో ఉన్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం ఇరుప్రాంతాల ప్రజలతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్‌ చేశారు.

విభజనతో ఇరుప్రాంతాల అభివృద్ధి: బీజేపీ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ సీనియర్‌ నేత హరిబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే ఇరుప్రాంతాలు వేగవంతంగా అభివృద్ధి జరుగుతాయని, దాంతో పాలన కూడా సులువు అవుతుందన్నారు. తెలంగాణపై ఎలాంటి రోడ్‌మ్యాప్‌ లేకుండా సీడబ్ల్యుసీ నిర్ణయం ప్రకటించడం విడ్డూరమని చెప్పారు. ఇరుప్రాంతాల మధ్య ఉన్న అనుమానాలు, అభ్యంతరాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. బీజేపీ కాకినాడ తీర్మానంలో ఒకఓటు రెండు రాష్ట్రాల తీర్మానం చేసిందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర విభజనపై బీజేపీ వెనక్కిపోదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ చేసిన తీర్మానంలో స్పష్టం లేదన్నారు. విభజన అంశాన్ని కాంగ్రెస్‌ తన సొంత వ్యవహారం చూసుకుంటోందని, అందుకే సమస్య జటిలమైందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి కాంగ్రెస్సే కారణమని ఆయన విమర్శించారు. ముఖ్యంగా సమైక్యాంధ్ర, తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యోగుల, ప్రజలను కేంద్రం పరిగణలోకి తీసుకొని ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. గతంలో జరిగిన రాష్ట్రాల విభజనలో ఎలాంటి సమస్యలు లేకుండా బీజేపీ కృషి చేసిందన్నారు. 610జీవో సక్రమంగా అమలైతే ఇరుప్రాంతాల ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండదన్నారు.

పెట్టుబడిదారులే అడ్డుకుంటున్నారు: టీఆర్‌ఎస్‌

ప్రపంచంలో తెలంగాణ ఉద్యమం అత్యంత ఉన్నతమైందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తారకరామారావు అన్నారు.  తెలంగాణ ఉద్యమం ఆరెస్సెస్‌ నుంచి ఆర్‌ఎస్‌యూ వరకు అందరినీ ఐక్యం చేసిందన్నారు. కొందరు సీమాంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్‌ను సాకుగా చూపుతూ రాష్ట్ర విభజనను అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్‌ రాజధానిగా పెట్టుబడులు పెట్టలేదన్నారు. తమ లాభాల కోసమే పెట్టుబడులు పెట్టారని ఆయన విమర్శించారు. పెట్టుబడుదారులు దేశంలో ఏ నగరాన్ని తమ నగరంగా చెప్పుకోవడం లేదన్నారు. హైదరాబాద్‌ విలీనానికి ముందే అది పెద్ద నగరంగా ఉందని ఆయన తెలిపారు. పరిపూర్ణ ప్రజాస్వామ్యం కోసం చిన్నరాష్ట్రాల ఆవశ్యకత ఉందన్నారు. నీటి పంపకాల విషయంలో ముఖ్యమంత్రి సీమాంధ్ర ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఆయన చెప్పారు. నీటి పంపకాల సమస్యలు పరిష్కరించేందుకు ట్రిబ్యునల్స్‌ ఉన్నాయని తెలిపారు. ఉద్యోగుల పంపకాలు కూడా రాజ్యాంగబద్దంగా జరుగుతాయని చెప్పారు. రాష్ట్రం విడిపోయినా సీమాంధ్ర ప్రజలకు పూర్తి భద్రత ఉంటుందన్నారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్నే ఒప్పుకుంటామని ఆయన స్పష్టంచేశారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని కేటీఆర్‌ చెప్పారు.

విభజనకు అంగీకరిస్తే అన్ని సమస్యలు పరిష్కారం: కోదండరాం

తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నేతలు అంగీకరిస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పారు. విభజనపై తలెత్తే సమస్యలు కమిటీలు వేసి పరిష్కరించవచ్చని తెలిపారు. ఇరుప్రాంతాల మధ్య వైషమ్యాలు తీవ్ర స్థాయికి చేరాయని, ఇలాంటి పరిస్థితుల్లో కలసి ఉండడం అసాధ్యమన్నారు. సామరస్య వాతావరణంలో రాష్ట్రం విడిపోతే రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డిలు రియల్‌ఎస్టేట్‌లకు కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు కట్టబెట్టాలన్న దురుద్దేశంతోనే వారు రాష్ట్ర విభజనకు అంగీకరించడం లేదన్నారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప ఏ ఇతర ప్రత్యామ్నాయాలను ప్రజలు అంగీకరించరని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *