రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు అండ్‌ కంపెనీ


న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 21 (జనంసాక్షి) :
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నాయకులు శనివారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నివారణకు జోక్యం చేసుకోవాలని ఆయనను కోరారు. కాంగ్రెస్‌ పార్టీ తన ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్‌లో చిచ్చుపెట్టిందని రాష్ట్రపతి వద్ద ప్రస్తావించారు. తెలంగాణ ఇవ్వమనిగానీ, వద్దని గానీ ఆయన రాష్ట్రపతి వద్ద ప్రస్తావించనట్టు తెలిసింది. తెలుగువారి మధ్య విద్వేషాలు తగ్గించాలని, ప్రజా జీవితం సాఫీగా సాగేందుకు ప్రయత్నించాలని మాత్రమే ఆయన ప్రణబ్‌ కోరినట్టు టీడీపీ నేతలు చెప్తున్నా ఆయన లోపాయకారీ చర్చలు మాత్రం వేరేగా సాగినట్టు సమాచారం. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నాయకులతో కలిసి శనివారం మొదట రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని తర్వాత సీపీఎం అగ్రనేత ప్రకాశ్‌ కారత్‌ను బాబు బృందం కలిసింది. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ విషయంలో బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించిందని ఈ సందర్భంగా బాబు అండ్‌ కో వారిద్దరి వద్ద చెప్పిందే చెప్పినట్టుగా సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై రాజకీయాలు చేసిందని చెప్పే బాబు తాను మాత్రం ఢిల్లీ వేదికగా అవే రాజకీయాలు సాగించాడు. అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయమంటూ కారత్‌తో భేటీ అనంతరం బాబు కొత్త పల్లవి అందుకున్నాడు. ఆ తర్వాత బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణకు అనుకూలంగా తమ పార్టీ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని, అయితే సీమాంధ్ర ప్రజల్లో సందేహాలను, విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించాలని కోరారు. అయితే బాబు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో పొత్తుతో పాటు మళ్లీ ఎన్‌డీఏలో చేరికపై సైతం చర్చలు సాగినట్టుగా సమాచారం. బాబు మాత్రం తాను రాష్ట్రంలోని పరిస్థితులతో మాత్రమే జాతీయ నేతలతో మాట్లాడినట్టు చెప్పారు.

తాజావార్తలు