విభజనకు అంగీకరిస్తే సీమాంధ్రులతో చర్చలు

‘ది హిందూ’ పత్రిక రౌంట్ టేబుల్ సమావేశంలో కోదండరామ్
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (జనంసాక్షి) :
సీమాంధ్రులు తెలంగాణ ఏర్పాటుకు, ఆంధ్రప్రదేశ్ విభజనకు అంగీకరిస్తే వారితో చర్చలకు సిద్ధమని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. రాష్ట్ర విభజన పరిణామాలపై ‘ది హిందూ’ పత్రక ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ¬టల్ తాజ్ డెక్కన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత మైసురారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి, బీజేపీ నేత హరిబాబు తదితరులు హాజరయ్యారు.
చర్చలతో సమస్య పరిష్కారం…
తెలంగాణ ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్పనిసరని టీ-జేఏసీ చైర్మన్ కోదండరాం అభిప్రాయపడ్డారు. విభజన వల్ల ఏవైనా సమస్యలు తలెత్తితే చర్చల ద్వారా, నిపుణుల కమిటీల ద్వారా పరిష్కరించు కోవచ్చని తెలిపారు. కొందరు విభజనపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నో అంశాలను పరిశీలించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందని తెలిపారు. విభజన వల్ల తలెత్తే వనరులు, ఆదాయ పంపిణీ సమస్యలను చర్చించి పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం మంత్రుల బృందం (జీఓఎం) ఏర్పాటు చేస్తుందని.. ఇంకా సమస్య ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. నీటి సమస్య ఉంటే.. నిపుణుల కమిటీ వేసి పరిష్కరించుకోవచ్చని, ఇతరత్రా సమస్యలుంటే కూర్చొని చర్చించుకోవచ్చన్నారు. అన్ని సమస్యలకు చర్చలే మంచి పరిష్కార మార్గమమన్నారు. ఎన్నో అంశాలను పరిశీలించిన తర్వాత, అన్ని పార్టీలు, అన్ని ప్రాంతాల నేతలు, ప్రజల అభిప్రాయాలు సేకరించిన తర్వాతే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందన్నారు. యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 50 రోజులు గడిచిపోయిందని అయినా రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన రాజ్యాంగ ప్రక్రియలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. ఎంత ఆలస్యమైతే ప్రజల మధ్య అంతరాలు పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. విభజనపై కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రాంతానికే సీఎంగా వ్యవహరిస్తున్నారని, విభజనపై అసంబద్ద వాదనలు చేస్తున్నారని విమర్శించారు. విభజన తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. సీమాంధ్రలో ఉద్యమాన్ని ప్రభుత్వమే పెంచి పోషిస్తోందని, ఉద్యోగుల సమ్మె విరమణకు కూడా సరైన ప్రయత్నం చేయలేదని సాక్షాత్తు హైకోర్టే వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన శాంతియుతంగా జరగాలనే తాము కోరుకుంటున్నామని, విభజన తర్వాత రెండు ప్రాంతాల మధ్య సతసంబంధాలు కొనసాగాలనే మేం భావిస్తున్నామని తెలిపారు. సీమాంధ్ర ప్రాంత చానెల్లు, పేపర్లు ప్రజలను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. వీలైనంత తొందరగా రాజ్యాంగ ప్రక్రియ పూర్తి చేసి, రాష్టాన్న్రి ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ఏర్పాటయ్యే వరకూ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
చిన్న రాష్ట్రాలు అవసరం: కేటీఆర్
పరిపూర్ణ ప్రజాస్వామ్యానికి చిన్న రాష్ట్రాల ఏర్పాటు అవసరమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అంతర్భాగమైన హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తామంటే ఒప్పుకొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్‌యూ దాకా అందరినీ తెలంగాణ ఉద్యమం కలిపిందని చెప్పారు. దేశంలో జరిగిన అత్యుత్తమ ఉద్యం తెలంగాణ ఉద్యమమని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉందని.. అప్పట్లోనే దేశంలో ఐదో అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందిందని చెప్పారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టామంటున్న సీమాంధ్ర వ్యాపారులు, రాజకీయ నేతలు.. నగర అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టలేదని, వారి స్వార్థ ప్రయోజనాలు, లాభాల కోసమే పెట్టారని విమర్శించారు. దేశంలో పెట్టుబడులుత పెట్టిన వారంతా ఆ ప్రాంతం తమదని ఎవరూ చెప్పటం లేదన్నారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటే తమకు అంగీకారమని తెలిపారు. తెలంగాణ-ఆంధ్ర విలీన సమయంలో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించారని, ఇక్కడ వనరులు దోచుకున్నారని.. అందుకే తాము విడిపోవాలంటున్నామని తెలిపారు.
విభజనపై అపోహలు వద్దు : నారాయణ
రాష్ట్ర విభజన వల్ల ఏదో జరిగిపోతోందని భావించడం సరైంది కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ అంటే ప్రత్యేక రాష్ట్రమే తప్ప ప్రత్యేక దేశం కాదన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పనిసరని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడాల్సిందేనని స్పష్టం చేశారు. విభజన వల్ల సమస్యలు తలెత్తితే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. విభజనపై కేంద్ర ప్రభుత్వం మంత్రులు కమిటీ ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కమిటీ ఇరు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వనరులు, ఆదాయం తదితర అంశాల పంపిణీపై చర్చిస్తుందన్నారు. అలాగే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కరానికి యత్నిస్తుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో విద్యా, ఉద్యోగాలు, నీటి పంపకాలపై తలెత్తే సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తామంటే తాము అంగీకరించబోమని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని చెప్పారు. రాజకీయ పార్టీలు సరైన విధానంతో వ్యవహరించాలని హితవు పలికారు. పూటకో మాట మార్చకుండా స్పష్టమైన విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్రం మరింత ఆలస్యం కాకుండా తక్షణమే రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభించాలని కోరారు.
విభజనే పరిష్కారం : హరిబాబు
రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణమని బీజేపీ నేత హరిబాబు విమర్శించారు. విభజన నిర్ణయాన్ని ఆ పార్టీ సొంత వ్యవహరంగా భావించడం వల్లే ఈ సమస్య తలెత్తిందన్నారు. విభజనపై అధికార పార్టీకి కచ్చితమైన రోడ్‌మ్యాప్ లేదని ఆరోపించారు. విభజన వల్ల తెలత్తే సమస్యలనే ఏవిధంగా పరిష్కరించాలి? వనరులు ఎలా పంపిణీ చేయాలన్న ప్రణాళిక కేంద్రం వద్ద లేదని మండిపడ్డారు. తాము గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని గుర్తు చేశారు. విభజనపై తాము స్పష్టమైన వైఖరితో ఉన్నామని తెలిపారు. అప్పట్లోనే ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇంకా ఆలస్యం చేయకుండా తక్షణమే బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. బిల్లుకు బేషరతుగా మద్దతిస్తామని పునరుద్ఘాటించారు. రాజకీయ లబ్ధి కోసం కాకుండా చిత్తశుద్ధితో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
అనిశ్చితి మంచిది కాదు : రాఘవులు
విభజనపై అనిశ్చితి కొనసాగించడం రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏ నిర్ణయం తీసుకున్నా వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మిగతా పార్టీల్లాగా కాకుండా తాము తొలి నుంచి ఒకే స్పష్టమైన విధానంతో ఉన్నామని తెలిపారు. భాషా ప్రాతిపదికన ఏర్పడి రాష్ట్రాల విభజనకు తాము వ్యతిరేకం అని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వం అనిశ్చితికి తెరదించాలని డిమాండ్ చేశారు.



