Tuesday, 3 November 2026

తెలంగాణ భాష, యాసపై సీమాంధ్రుల దాడి


సంస్కృతి పరిరక్షణకు యూనివర్సిటీ అవసరం : కేసీఆర్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21 (జనంసాక్షి) :
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై దాడి జరిగిందని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విమర్శించారు. తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని కించపరిచారని మండిపడ్డారు. తెలంగాణ భాషపై భయంకరమైన దాడి జరిగిందని.. అది ఇక్కడి వారి మనస్సును తీవ్రంగా గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోది తురకం కలిసిన తెలుగు అని, సీమాంద్రలోని కొందరు కవులు అన్నారని గుర్తు చేశారు. తాము నిజం పాలనలో ఉన్నందున ఉర్దూ తెలంగాణ భాషలో మిళితమైందన్నారు. అక్టోబర్‌ 4 నుంచి 12 వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బంగారు బతుకమ్మ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్‌ను, సీడీని శనివారం కేసీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు భాషా మాండలికాలు ఉంటాయని, ప్రాంతాలను బట్టి భాష, యాసలు కూడా వేర్వేరుగా ఉంటాయన్నారు. ఒక జిల్లాలోనే వృత్తులు, పంటల పేర్లలో తేడాలుంటాయన్నారు. కానీ, సీమాంధ్రుల పాలనలో అన్ని విధాలుగా తెలంగాణపై దాడి జరిగిందన్నారు. సినిమాల్లో తెలంగాణ యాసను వెక్కిరించారని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరిగిందని చెప్పారు. ఆంధ్ర పార్టీలు మన సంస్కృతిని అనగదొక్కేందుకు యత్నించాయని విమర్శించారు. తెలంగాణ భాషను అవమానపరిచారని.. మనం పచ్చడిని తొక్కు అని అంటే.. ఏంటి తొక్కేదని ఎద్దేవా చేశారన్నారు. ఆంధ్రోళ్లు తెలంగాణ భాషను తక్కువ చేసి మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘స్థానికంగా మాండలికాలు ఉంటాయి. ఆంధ్రలో పాటలు పాడుతూ బుల్లెమ్మ, బుల్లోడా అని పేర్లు పెట్టుకొని తిడుతారు. అదే మన దగ్గర బుల్లెమ్మ అని పిలిస్తే లాగి కొడతారు. మనం తిట్టుకొనే పదాలు ఆంధ్రోళ్లు సంతోషంగా మాట్లాడుకుంటారు. తెలుగు సినిమాల్లో జోకర్‌ గాళ్లకు తెలంగాణ యాస. మనది తౌరక్యాంధ్రం అని ఆంధ్రోళ్లు పేర్కొంటారని’ విమర్శించారు. నిజాం పరిపాలనలో ఉండడం వల్లే తెలంగాణ భాషలో ఉర్దూ ఉంటుదని చెప్పారు. యాస, భాష పేరుతో తెలంగాణ సంస్కృతిపై దాడి జరిగిందని, మాండలికాలను, మాటలను కూడా ఎద్దేవా చేశారన్నారు. ఎవరి భాష వారిది.. ఎవరి యాస వారిది.. ఏ ప్రాంత మాండలికాన్నైనా గౌరవించాలని కోరారు. సీమాంధ్రులు మాట్లాడేదే తెలుగు అనుకోవడం అవివేకమన్నారు. ఉర్దూ పుట్టిందే తెలంగాణలో అని చెప్పారు. ఉర్దూ తెలుగు చెట్టాపట్టాలేసుకొని నడయాడిన గడ్డ ఇది అని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతిపై దాడి జరగడంతో పండులకు దూరమయ్యాయమని.. జాగృతి కృషి వల్ల సంస్కృతి, భాష విూద తెలంగాణ ప్రజల్లో చైతన్యం వచ్చిందని ప్రశంసించారు. చదువు, సాహిత్యంతో సంబంధం లేకుండా తెలంగాణలో ఎన్నో పాటలు వారసత్వంగా వచ్చాయన్నారు. సంస్కృతి, సంప్రదాయాల రక్షణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కల్చరల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవనానికి తెలంగాణ జాగృతి చేస్తున్న కృషి అద్భుతమని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *