ఇక ఆధార్ తప్పనిసరి కాదు

నిర్బంధంగా తీసుకోవాల్సిన అవసరం లేదు
సుప్రీం సంచలన తీర్పు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23 (జనంసాక్షి) :
ఆధార్ కార్డులు అందక, ప్రభుత్వ సబ్సిడీలు లభించక ఇబ్బందులు పడుతున్న వారి కి ఊరటనిస్తూ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. గ్యాస్ కనె క్షన్ సహా ఇతర సేవలకు ఆధార్‌కార్డు తప్పనిసరి చేయడం సరికాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రతీ దానికి ఆధార్‌తో లంకె పెట్ట డం కుదరదని తేల్చి చెప్పిం ది. ఆధార్ కార్డును నిర్బం ధంగా తీసుకోవాల్సిన అవస రం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అక్రమంగా వలస వచ్చిన వారికి ఆధార్ కార్డులుజారీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. అన్ని పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని సవాలు దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ప్రతీ అంశానికి ఆధార్ కార్డుకు ముడిపెట్టడం సరికాదని జస్టిస్ బీఎస్ చౌహన్, జస్టిస్ ఎస్‌ఏ బోబ్డేలతో కూడిన ధర్మానసం స్పష్టం చేసింది. వివాహ రిజిస్ట్రేషన్లు, వేతనాల పంపిణీ, ప్రావిడెంట్ ఫండ్ సహా ఇతర ప్రజాసేవలకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం కుదరదని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందే వివిధ పథకాలను ఆధార్‌తో అనుసంధానం చేయడం తగదని తేల్చి చెప్పింది. ఆధార్ కార్డు తీసుకోవడం నిర్బంధం కాదని, స్వచ్ఛందంగా అందజేసేలా చూడాలని ప్రభుత్వానికి సూచించింది. ‘ముఖ్యమైన సేవలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరికీ ఆధార్ కార్డులు తప్పనిసరి చేయడం కుదరదు’ అని స్పష్టం చేసింది. అయితే, రూ.50 వేల కోట్లతో చేపడుతున్న ఆధార్ ప్రాజెక్టును దృష్టిలో ఉంచుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ముఖ్యమైన సేవలకు ఆధార్‌తో ముడిపెట్టడం కుదరదని తేల్చి చెప్పింది. సబ్సిడీల భారాన్ని తగ్గించుకొనేందుకు గాను యూపీఏ ప్రభుత్వం గతేడాది నుంచి నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోంది. సబ్సిడీ నగదును నేరుగా వినియోగదారుడికి అందజేసేందుకు గాను ‘ఆధార్’ను ప్రవేశపెట్టింది. ప్రతీ పథకానికి ఆధార్‌ను తప్పనిసరి చేసేలా ప్రణాళిక రూపొందించింది. తొలుత గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేసింది. అయితే, నగదు బదిలీ సహా ఇతర పథకాలన్నింటికీ ఆధార్‌ను ముడిపెట్టడాన్ని సవాలు చేస్తూ కర్ణాటక మాజీ న్యాయమూర్తి కేఎస్ పుత్తుస్వామి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆధార్, నగదు బదిలీ పథకంపై స్టే విధించాలని కోరారు. ‘ఈ పథకం ప్రాథమిక హక్కులకు భంగకరం. ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 21 (జీవించే హక్కు, స్వేచ్ఛా హక్కు)లకు ఈ పథకం భంగం కలిగిస్తోంది. ఇది స్వచ్ఛందమేనని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో అమలు జరగడం లేదు. వివాహ రిజిస్ట్రేషన్లు సహా ఇతర సేవలకు ఆధార్‌ను తప్పనిసరి చేశారు. ఆధార్ కార్డులు లేని వారికి వివాహ రిజిస్టేష్రన్లు చేయబోమని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది’ అని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం ఆధార్‌ను తప్పనిసరి చేయడం సరికాదని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.



