జనభేరీ మొగిద్దాం

అడ్డంకులు అదిగమిద్దాం : దేవీప్రసాద్
ఆదిలాబాద్‌టౌన్, సెప్టెంబర్ 24 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఆత్మాగౌరవాన్ని చాటేలా జనభేరీ మొగిద్దామని టీఎన్‌జీవోల రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్ర సాద్ పిలుపునిచ్చారు. పట్టణంలో టీ జేఏసీ ఆధ్వర్యంలో 1,365 రోజులుగా నిర్వహిస్తున్న రిలే దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి, అనంతరం బీజీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన టీఎన్‌జీవోల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌ను అక్రమంగా దోచుకునేందుకే సీమాంధ్రులు కృత్రిమ ఉద్యమాన్ని సాగిస్తున్నారని, వారికి పాలకులు, ప్రతిపక్షాలు అండగా నిలుస్తున్నాయని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. సీమాంధ్రుల కుట్రలతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై ఎంతమాత్రం వెనక్కు తగ్గినా తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీమాంధ్ర ఆధిపత్య శక్తుల పన్నాగాలను తెలంగాణ ప్రజలు సమష్టి పోరాటాలతో అడ్డుకొని తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. సీమాంధ్ర పెత్తందారులు ఢిల్లీలో తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారని, ఆయా పార్టీలకు భవిష్యత్‌లో గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు.



