వీకే సింగ్ పేర్లిస్తే దర్యాప్తు చేస్తాం : షిండే

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24 (జనంసాక్షి) :
సైన్యం నుంచి ‘సుస్థిరత’ కోసం నిధులు పుచ్చుకున్న మంత్రులెవరో పేర్లిస్తే దర్యాప్తు జరిపిస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. జమ్మూకాశ్మీర్ మంత్రులకు సైన్యం నిధుల అందజేతపై ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. మంత్రుల పేర్లు చెప్పాలని ఆయన వీకే సింగ్‌ను కోరారు. వీకే సింగ్ వ్యాఖ్యలపై ఆయన ఆచితూచి స్పందిస్తూ కేంద్రం సైన్యం నిధులనెప్పుడూ పక్కదారి పట్టించలేదని చెప్పారు. సైన్యానికి కేటాయించిన నిధులు రక్షణ రంగ వ్యవస్థ బలోపేతానికి మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందులో కేంద్రం తప్పేమి లేదని అన్నారు.



