సోనియాతో భేటీ అనంతరం టీ కేబినెట్‌ నోట్‌ రెడీ


కిరణ్‌ ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రి కాదు
సీమాంధ్ర సీఎంగా వ్యవహరించడం సరికాదు
ప్రైవేటు విద్యాసంస్థలు, బస్సులు, వాణిజ్య సంస్థలు తెరిచే ఉంటయి
ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం బంద్‌ చేస్తరా?
ఏపీఎన్‌జీవోలు సమ్మె విరమించాలి
దిగ్విజయ్‌సింగ్‌
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 25 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేబినెట్‌ నోట్‌ సిద్ధమైందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల
ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. తెలంగాణపై వెనక్కు తగ్గేది లేదని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. విభజనపై ముందుకే వెళ్తామని తేల్చి చెప్పింది. తెలంగాణపై ముసాయిదా సిద్ధమవుతోందని.. త్వరలోనే కేంద్ర క్యాబినెట్‌ ముందుకు వస్తుందని తెలంగాణపై ¬ం శాఖ ముసాయిదా నోట్‌ తయారు చేస్తోందని చెప్పారు. బుధవారం దిగ్విజయ్‌సింగ్‌ పార్టీ అధినేత్రి సోనియగాంధీతో ఆమె నివాసంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో తాజా పరిణామాలు, విభజనపై ముందడుగు, క్యాబినెట్‌ నోట్‌ తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. సోనియాతో భేటీ ముగిసిన అనంతరం దిగ్విజయ్‌ మీడియాతో మాట్లాడారు. విభజన వల్ల తలెత్తే అన్ని సమస్యలకూ తాము అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని ఉద్యోగులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్ని ప్రాంతాలకు ముఖ్యమంత్రి అన్న విషయాన్ని మరిచిపోవద్దని సూచించారు. అన్ని ప్రాంతాల బాధ్యత ఆయనపై ఉందని స్పష్టం చేశారు. విభజనపై నోట్‌ తయారవుతోందని, అది సిద్దం కాగానే క్యాబినెట్‌ ఆమోదానికి పంపిస్తామని చెప్పారు. క్యాబినెట్‌ ఆమోదం పొందగానే తెలంగాణ నోట్‌ను అసెంబ్లీకి పంపుతామని వివరించారు. అయితే, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందనేది తాను చెప్పలేనని పేర్కొన్నారు. ఆ విషయాన్ని ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేను అడిగితేనే బాగుంటుందని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అన్ని పార్టీలు తెలంగాణకు అంగీకరించాయి కాబట్టే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామని, ఆ నిర్ణయం అమలు దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు.
సమ్మె విరమించండి..
సీమాంధ్రకు చెందిన ఉద్యోగులు తక్షణమే సమ్మె విరమించాలని దిగ్విజయ్‌  కోరారు. రాష్ట్ర విభజనకు సంబంధించి వారి సమస్యలన్నీ కచ్చితంగా పరిశీలిస్తామని హావిూ ఇచ్చారు. సీమాంద్రలో సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆందోళనలు విరమించి తక్షణమే విధుల్లో చేరాలని కోరారు. ‘ప్రభుత్వ ఉద్యోగాలు సమ్మె విరమించాలి. విధుల్లో చేరాలి. సమ్మె విరమించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానని’ వ్యాఖ్యానించారు. సీమాంధ్రలో ప్రైవేట్‌ సంస్థలు పని చేస్తుంటే ప్రభుత్వ సంస్థలు ఎందుకు మూతబడ్డాయని ప్రశ్నించారు. ప్రైవేట్‌ దుకాణాలు, రవాణా వ్యవస్థ, కార్యాలయాలు, పాఠశాలలు నడుస్తుంటే ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంచడం ఎంతవరకు సబబు? అని నిలదీశారు. ప్రైవేట్‌ కార్యాలయాలన్నీ పని చేస్తున్నా.. ప్రభుత్వ సంస్థలనే ఎందుకు అడ్డుకుంటున్నారని ఉద్యోగులను ప్రశ్నించారు. ప్రైవేట్‌ సంస్థలన్నీ పని చేస్తున్నప్పుడు ఉద్యోగులు సమ్మె చేసి ఏం లాభమని ప్రశ్నించారు. సీమాంధ్ర ఎంపీలు రాజీనామాలు చేయడం సరికాదని అన్నారు. సీమాంధ్ర ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే మాకు చెప్పండని, వాటిని తాము పరిష్కరిస్తామని సూచించారు. అంతేకాని రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదన్నారు.

సీఎంపై అసహనం

తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై దిగ్విజయ్‌ అసహనం వ్యక్తం చేశారు. సమైక్య గళం వినిపిస్తున్న కిరణ్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కిరణ్‌ ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రి కాదు రెండు ప్రాంతాలకు ముఖ్యమంత్రి అన్న విషయం మరిచిపోవద్దని హితవు పలికారు. అన్ని ప్రాంతాల వారు ఎన్నుకొంటేనే సీఎం అయ్యారని గుర్తించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికే పరిమితం కాదు.. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. అన్ని ప్రాంతాల బాధ్యత సీఎంపై ఉందని చురకలంటించారు. జగన్‌తో కుమ్మక్కయ్యారంటున్న చంద్రబాబు వ్యాఖ్యలు అవాస్తవమని కొట్టిపడేశారు. కాంగ్రెస్‌ జగన్‌తో కుమ్మక్కైతే టీడీపీ, బీజేపీతో కుమ్మక్కయిందా? అని ప్రశ్నించారు. తమను విమర్శిస్తున్న టీడీప, బీజేపీతో పొత్తుకోసం ఎందుకు వెంపర్లాడుతోందని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తుపై చంద్రబాబే చెప్పాలని డిమాండ్‌ చేశారు.