కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం

కాశ్మీర్‌తో సహా అన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధం
ప్రధాని మన్మోహన్
ఐరాస : జమ్మూ కాశ్మీర్ భారత్‌లో ఓ భాగమని ప్రధాని మన్మోహన్‌సింగ్ స్పష్టం చేశారు. అమెరికా పర్యటన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లో ఉగ్రవాద యంత్రాంగాన్ని మూసివేయాలని డిమాండ్ చేశారు. జమ్మూకాశ్మీర్ ఐక్యత, ప్రాదేశిక సమగ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్న మన్మోహన్, కాశ్మీర్ మినహా అన్ని సమస్యల పరిష్కారానికి పాక్ చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. పేదరిక నిర్మూలనకు మరింత కట్టుదిట్టంగా పనిచేయాల్సిన అవసరం ఉందని, అభివృద్ధి చెందుతున్న దేశాలపై ద్రవ్యోల్బణం పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అతిపెద్ద పథకం ఆహార భద్రత కార్యక్రమాన్ని భారత్ చేపట్టిందన్నారు.
మన్మోహన్‌కు అరుదైన గౌరవం
వాషింగ్టన్: అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు అత్యంత గౌరవం లభించింది. శ్వేతసౌధంలోని ఓవల్ కార్యాలయంలో మన్మోహన్‌తో భేటీ అయిన ఒబామా సమావేశం అనంతరం స్వయంగా కార్యాలయం వరండా (పోర్టికో) దిగొచ్చి వచ్చి భారత ప్రధానికి వీడ్కోలు పలికారు. శ్వేతసౌధం ప్రోటోకాల్ విషయాలు తెలిసిన వారంతా ఇది అత్యంత అరుదైన ఘటన అని, ఇటీవల కాలంలో అధ్యక్షుడు ఎవరికీ ఇంతటి మర్యాద ఇవ్వలేదని వెల్లడించారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ని ఓ గొప్పనేతగానే కాకుండా దౌత్యవేత్తగా, ఆర్థికవేత్తగా ఒబామా గౌరవిస్తారని శ్వేతసౌధంలోని ప్రోటోకాల్ అధికారులు చెప్పారు. ఇద్దరు నేతలు పరస్పరం గొప్ప గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారని వెల్లడించారు. ”భారత ప్రధానమంత్రిగా మన్మోహన్‌సింగ్ అమెరికాకు వ్యక్తిగతంగా నాకు అత్యంత గొప్ప స్నేహితుడు” అని సమవేశం అనంతరం ఒబామా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ”విభిన్న రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు, విస్తరించేందుకు అధ్యక్షుడు ఒబామా అధ్బుతమైన తోడ్పాటునందిస్తున్నారు.” అని మన్మోహన్ అమెరికా అధ్యక్షుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. నవంబర్, 2009లో మన్మోహన్‌సింగ్ గౌరవార్థం ఒబామా విందు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ విందులో ఆయన మాట్లాడుతూ భారత్, అమెరికాలు 21వ శతాబ్దంలో అనివార్య భాగస్థులని వ్యాఖ్యానించారు.



