సకలజనభేరి సభ గ్రాండ్‌ సక్సెస్‌


ప్యాకేజీ తెలంగాణకే ఇవ్వాలి
ఆరు తర్వాత కిరణ్‌ ప్లగాఫ్‌
తెలంగాణ పోరాటంలో ధర్మముంది
వేలమంది కిరణ్‌ బాబు, జగన్‌బాబు, చంద్రబాబులొచ్చినా వెంట్రుక కూడా పీకలేరు : కేసీఆర్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి) :
అన్ని రకాలుగా నష్టపోయిన తెలంగాణ ప్రాంతానికే ప్యాకేజీ ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే తమ ప్రాంతానికి ఐదు లక్షల కోట్లివ్వాలని చంద్రబాబు అడిగా రని, తీవ్రంగా నష్టపోయిన వారికే ప్యాకేజీలు ఇస్తారని ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సకల జనుల భేరి సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు ఎన్ని టర్న్‌లు తీసు కున్నా పరిస్థితి మారదన్నారు. వెయ్యి మంది యువకులు బలిదానాలు చేసుకున్నప్పుడు ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఓట్లకోసం వస్తారుగానీ తెలంగాణ ప్రజలకు కష్టమొస్తే రారా.. అన్నారు. న్యాయం లేకుండా సమన్యాయం ఎక్కడుంటుందని వైఎస్సార్‌ సీపీనుద్దేశించి అన్నారు. ఆ పార్టీ వాదన సరైంది కాదన్నారు. ప్రస్తుతం సీమాంధ్రలో కొనసాగుతున్నది కృత్రిమ ఉద్యమమేనన్నారు. ఆ ఉద్యమాన్ని నడిపిస్తున్నది కూడా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డియేనని తెలిపారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సమయంలో జై తెలంగాణ అన్న పోలీస్‌ ఉద్యోగిని దండించే హక్కు అశోక్‌బాబుకు ఎక్కడిదని ప్రశ్నించారు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులేనని, కావాలని వారు అలా నడుచుకున్నారని విమర్శించారు. అయినప్పటికీ తాము శాంతంగానే ఉన్నామని అన్నారు. మౌనంగా ఉండడాన్ని అసమర్థతగా భావించరాదని అన్నారు. నిజమైన ఉద్యమకారుడు సింహంలా వ్యవహరిస్తాడని, అందుకు పోలీసు ఉద్యోగి శ్రీనివాసే సాక్ష్యమన్నారు. 50 వేల మంది ఉన్న సభకు వెళ్ళి జై తెలంగాణ అనడం ఆయనకే చెల్లిందన్నారు. అంతేగాని ఒకరోజు గడ్డి తింటూ, ఒకరోజు నీళ్ళలో ఉంటూ, మరోరోజు సగం దుస్తులతో ఉంటూ, మరొకరు కొరఢాలతో కొట్టుకుంటూ దాన్ని ఉద్యమం అంటున్నారని, ఇదెక్కడి చోద్యమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇస్తున్నట్టు 2009, డిసెంబర్‌ 9న కేంద్రం ప్రకటించగానే సీమాంధ్ర నేతలు ఊసరవెళ్ళుల్లా మారి 23నాటికి దాన్ని తారుమారు చేశారన్నారు. తాజాగా జులై 30న సీడబ్ల్యూసీ ప్రకటన చేస్తే ఆ మరుసటి రోజునుంచి మోసం చేసేందుకు కుట్రలు పన్నారని అన్నారు. ఆంధ్రావాళ్ళు ఎవరైనా ఆంధ్రావాళ్ళే.. లంకలో ఉండేది రాక్షసులేనని అన్నారు. ఆంధ్రావాళ్ళు తెలంగాణ ద్రోహులేనని పేర్కొన్నారు. అందుకే ఆంధ్రావాళ్ళను నమ్మడం లేదన్నారు. నిట్టనిలువునా చీలుతున్నట్టుగా సంకేతాలు వచ్చిన సమయంలో ఎంతో గంభీరంగా, ఎంతో నిబ్బరంగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి లేనిపోని రంకెలు వేయడం సిగ్గుచేటన్నారు. ఇరు ప్రాంతాలను రాజీచేసి ఏదో విధంగా విభజన ప్రక్రియ విజయవంతమయ్యేలా చూడాల్సిన సీఎం అలా వ్యవహరించకపోగా ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించడం అన్యాయమన్నారు. లక్షలాది మంది చంద్రబాబులు, లక్షలాది మంది జగన్లు, లక్షలాది మంది కిరణ్‌ కుమార్‌రెడ్డిలు వచ్చినా ఏం పీకలేరన్నారు. వాళ్ళే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ధర్మం ఉంది. భగవంతుడి ఆశీర్వాదం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసుకుంటాం. దోపిడీని యథేచ్చగా కొనసాగించేందుకే వాళ్ళందరూ సమైక్యాంధ్ర అంటున్నారని విమర్శించారు. అక్టోబర్‌ 6 తర్వాత ముఖ్యమంత్రి పదవిలో కిరణ్‌ కుమార్‌రెడ్డి సాగే అవకాశం లేదన్న సంకేతాలు వస్తున్నాయన్నారు. హైదరాబాద్‌ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ మాత్రమే తాము కోరుతున్నామన్నారు. పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాలని అనడంతో పెద్ద మనసుతో ఒప్పుకున్నామన్నారు. ఆ సంస్కారం కూడా సీమాంధ్రులకు లేకపోవడం విచారకరమన్నారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి కుయుక్తులు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో బలహీనవర్గాల కళ్ళల్లో ఆనందం చూడాలన్నారు. తలతెగి పడినా తెలంగాణలో దోపిడీ కొనసాగనీయబోమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్తిగా సహకరిస్తామని, బేషరతుగా సుష్మాస్వరాజ్‌ ప్రకటించడంపై ఆమెను అభినందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకవేళ యుపిఎ టర్న్‌ తీసుకుంటే రానున్న ఎన్నికల్లో వచ్చే బిజెపి ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ వస్తుందని అన్నారు. సభకు విచ్చేసిన ఉద్యోగులందరికీ, పలు పార్టీల నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. చిన్న మైదానంలో పెట్టడంవల్ల చాలామంది ఇబ్బంది పడ్డారని, క్షమించమని అడుగుతున్నానని అన్నారు. వచ్చే సభ 60, 70 ఎకరాల ఖాళీ ప్రదేశంలో నిర్వహించుకుందామని చెప్పారు. జై తెలంగాణ.. అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
దోపిడీకి, న్యాయానికి జరుగుతున్న పోరాటం

తెలంగాణలో వ్యవసాయోగ్యమైన భూమి 50 లక్షల హెక్టార్లు పడావ్‌ బడ్డది
విడిపోతేనే ఇరు ప్రాంతాలకు అభివృద్ధి : కోదండరామ్‌
హైదరాబాద్‌ :
తెలంగాణ ప్రజలది బతుకు పోరాటమన్నారు. దోపిడీకి, న్యాయానికి మధ్య జరుగుతున్న పోరాటమిదని రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర పాలకులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో దాదాపు 50 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి నిరుపయోగంగా ఉందన్నారు. ఆంధ్ర నుంచి నూటికి ఒక్కరు మాత్రమే హైదరాబాద్‌ వస్తున్నారన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఏర్పడినంత మాత్రాన హైదరాబాద్‌లో ఎవరికకీ ఇబ్బంది లేదని తెలిపారు. సీఎం అబద్దాల ప్రజారం విని సీమాంధ్ర ప్రజలు మోసపోవద్దని ఆయన కోరారు. తెలంగాణను ఒక ఎవరూ అడ్డుకోలేరని ఆయన వెల్లడించారు. బిల్లు పెడితే బీజేపీ మద్దతు ఇస్తుందని బీజేపీ నేత సుష్మాస్వరాజ్‌ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. విడిపోతేనే ఆంధ్ర ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశముందన్నారు. ఆంధ్ర పాలకుల పెత్తనం త్వరలో కూలిపోతుందని ఆయన పేర్కొన్నారు. మీడియాలో ఒక వర్గం సీమాంధ్ర పాలకులకు తొత్తులుగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు.
ఢిల్లీ దిమ్మదిరగాలే : దేవీప్రసాద్‌
సకల జనభేరి సభ ద్వారా ఢిల్లీ దిమ్మదిరగాలని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె ఎందుకు చేస్తున్నారో వాళ్లకే తెలియదన్నారు. సకల జనుల సమ్మెలో టీ ఉద్యోగులపై ఉక్కుపాదం మోపారని, సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెను ప్రభుత్వమే దగ్గరుండి నడిపిస్తోందని, ఇది ప్రభుత్వ వివక్ష కాదా అని ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు. న్యాయ సూత్రాల ప్రకారమే ఉద్యోగుల విభజన జరుగుతుందని తేల్చి చెప్పారు. విభజన అనివార్యమని, దానిని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో వెంటనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు.
తెలంగాణ ఆపడం ఎవరితరం కాదు : కేకే
తెలంగాణ ఏర్పాటును ఆపడం ఎవరితరం కాదని కే కేశవరావు పేర్కొన్నారు. సకలజన భేరి సభలో ఆయన ప్రసంగిస్తూ హైదరాబాద్‌పై కొందరు పెడుతున్న కిరికిరీలు చెల్లవన్నారు. హైదరాబాద్‌ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అంతిమ దశకు వచ్చిందని సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ అన్నారు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటం కారణంగా రాష్ట్ర ప్రకటన వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలది కడుపుకాలిన పోరాటంగా ఆయన అభివర్ణించారు. ఆంధ్రాప్రాంత పోరాటం అప్రజాస్వామిక పోరాటమన్నారు. భాజాపా నేత నాగం జనార్ధనరెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే భాజాపా అధికారంలోకి రాగానే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. భాజపా ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భవిష్యత్‌లో తాము ఎవరితో పొత్తులు పెట్టుకోబోమని, ఒక వేళ అలాంటి పరిస్థితి వస్తే తెలంగాణకు అనుకూలంగా ఉన్న వారితోనేనన్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో నిర్ణయించిన విధంగా తెలంగాణ ఏర్పాటు చేస్తే తాము మద్దతిస్తామని సుష్మా స్వరాజ్‌ తెలిపారని అన్నారు. టీ జేఏసీ కన్వీనర్‌ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ ఒప్పందాల ఉల్లంఘనే తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిందన్నారు. సీమాంధ్రులు హైదరాబాద్‌ నగర శివారులోని భూములు కబ్జా చేశారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ తెలంగాణ ప్రజల రక్తమాంసాలతో నిర్మించిన నగరమని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడితే సీమాంధ్రకు జరిగే నష్టం ఒక్కటి చెప్పండని అడిగారు. తెలంగాణకు జాతీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయని తెలిపారు. సీమాంధ్ర జేఏసీకి కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వం వహించాలని అనుకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.
పెట్టుబడి దారుల కుట్రలను సీమాంధ్ర ప్రజలు గమనించాలని టీజేఏసీ నేత శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ గడ్డమీద జై తెలంగాణ అంటే కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌పై దాడి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్‌పైనే సీమాంధ్ర నేతల ప్రేమ తప్ప అక్కడి ప్రజలపై కాదని తెలిపారు. తెలంగాణ వస్తే పెట్టుబడిదారులు ఆక్రమించిన భూముల బండారం బయటపడుతుందనే ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడితే అక్రమంగా ఉద్యోగాలు సంపాదించిన వారి ఉద్యోగాలు, సీఎం ఉద్యోగం మాత్రమే పోతుందని, సామాన్య ప్రజలకు జరిగే నష్టమేమి లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ నేత విఠల్‌ తెలిపారు. 1956లో ముల్కీ నిబంధనలు అమలు చేయకుండా 24 వేల ఉద్యోగాలు కొల్లగొట్టారని తెలిపారు.