ఆర్థిక సంక్షోభంలో అమెరికా

జీతాలు చెల్లించలేని పరిస్థితి
8 లక్షల మంది ఉద్యోగులపై ప్రభావం
మూతబడిన ప్రభుత్వ శాఖలు
రెండు దశాబ్ధాల తర్వాత ఈ దుస్థితి
స్తంభించిన ప్రభుత్వ కార్యకలాపాలు
వాషింగ్టన్, అక్టోబర్ 1 (జనంసాక్షి) :
అమెరికా ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న అగ్రరాజ్యంలో పాలన స్తంభించింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి లేక ఏకంగా ప్రభుత్వ కార్యాలయాలను మూసివేసే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు సెలవులపై వెళ్లాల్సి వచ్చింది. ఫలితంగా ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దాదాపు రెండు దశాబ్దాల అనంతరం ప్రభుత్వ శాఖలు మూతబడడం ఇదే తొలిసారి. ఆరోగ్య భద్రత చట్టంపై ప్రజాప్రతినిధుల సభలో ఏకాభిప్రాయం కుదరలేదు. చట్టంలో మార్పులు తీసుకురావాల్సిందేనని రిపబ్లికన్లు పట్టుబట్టారు. అయితే, అందుకు అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు డెమోక్రాట్లు తిరస్కరించారు. దీంతో చట్టం ఆమోదానికి రిపబ్లికన్లు ప్రభుత్వానికి సహక రించక పోవడం, బడ్జెట్ మంజూరు కాకపోవ డంతో ఈ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో ప్రభత్వ కార్యాలయాలు మూసివేయాల్సి వచ్చింది. కేవలం మిలిటరీ, వాయు నియంత్రణ సంస్థలు మాత్రమే పని చేస్తున్నాయి. రాజకీయ సంక్షోభంతో స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. కాగా, తాజా ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఒబామా వెల్లడించారు. కాంగ్రెస్ బడ్జెట్‌ను ఆమోదించి నిధులు కేటాయించే వరకూ ప్రభుత్వ సంస్థలు మూసివేయాలని ప్రకటించారు. అమెరికన్ కాంగ్రెస్ తన బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలం కావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.



