Tuesday, 3 November 2026

ముందు అనుకూలమని మాట మారిస్తే ఎలా?


బొత్స సత్యనారాయణ
హైదరాబాద్‌ , అక్టోబర్‌ 4 (జనంసాక్షి):
తెలంగాణకు ముందు అనుకూలమని టిడిపి అధినేత చంద్రబాబు, వైకాపా అధినేత జగన్‌ చెప్పి ఇప్పుడు మాట మారిస్తే ఎలాగని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అంశం చాలా బాధాకరమైందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విభజన నిర్ణయం తనకు నిరాశ కలిగించిందని ఆయన విూడియాతో మాట్లాడుతూ అన్నారు.  అన్ని పార్టీలు రాష్టాన్న్రి విభజించాలని కోరాయని, దీనిపై కాంగ్రెస్‌ పార్టీయే నిర్ణయం తీసుకుంది కాబట్టి ప్రజల్లో మా పార్టీపైనే వ్యతిరేకత ఉందని చెప్పారు. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులుగా ఉన్న మాపై ప్రజల్లో ఆగ్రహం ఉందని అన్నారు. ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయని తెలిపారు. రాష్ట్ర విభజనపై టిడిపి అధినేత చంద్రబాబు, వైకాపా అధినేత జగన్‌ మాట్లాడిన మాటలు రాజకీయ లబ్ది కోసం కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మాటల్లో ఎక్కడైనా సమైక్యమనే మాట ఉందా? అని మండిపడ్డారు. సమైక్యత విషయంలో వారి ప్రేమ, మాటలు ఎంత నాటకమో ప్రజలు ఆలోచించాలని కోరారు.తెలంగాణ నోట్‌ను ఆమోదిస్తూ కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరమైనా దీనిని వ్యతిరేకించేందుకు ఆలోచనచేస్తున్నామని అన్నారు.   సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిగా విభజన విషయంలో తాను చాలా బాధపడుతున్నానని అన్నారు. రాష్ట్రంలోని ఒకటి రెండు పార్టీలు మినహా రాష్ట్ర విభజనకు మొదట అన్ని పార్టీలు ఓకే చెప్పాయని అన్నారు. తర్వాత యూటర్న్‌ తీసుకున్నాయని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు టీడీపీ, వైసీపీలు మొదట ఓకే చెప్పాయని తర్వాత తాము రెండు ప్రాంతాల సమస్యలను పరిష్కరించాక విభజించమని అన్నామంటున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు, వైఎస్‌ జగన్‌ రాజకీయ లబ్ది కోసం మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని సమస్యకు కాంగ్రెస్‌పార్టీ పరిష్కారం చూపింది కాబట్టి మాపై, మాపార్టీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండటం సహజమేనని అన్నారు. రాష్ట్ర విభజనే చంద్రబాబు విధానమని విమర్శించారు. ఇక జగన్‌ మాటలు చూస్తేనైతే అయ్యో పాపం అనేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు.ఆనాడు జగన్‌ తండ్రి సమాధి సాక్షిగా తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, నిన్ననేమో మొసలి కన్నీరు కారుస్తున్నాడని దుయ్యబట్టారు. విజయమ్మ తెలంగాణలో పర్యటించినపుడు బైబిల్‌ చేతిలో పట్టుకుని తెలంగాణకు అనుకూలమని ప్రకటించారు. సమైక్యం విషయంలో జగన్‌, చంద్రబాబు మాటలు ఎంత నాటకమో ఆలోచించాలని కోరారు. రాష్ట్ర విభజన అవసరంలేదని ఆయనగానీ, ఆయన పార్టీగానీ ఏనాడు చెప్పలేదని అన్నారు. ఇదిలావుంటే  కేంద్ర కేబినెట్‌ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంపై విజయనగరం జిల్లాలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి విజయనగరంలోని ఎంజీ రోడ్డులో ఉన్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. బొత్స ఇంటిని ముట్టడించేందుకు సమైక్యవాదులు భారీగా తరలి వచ్చారు. పోలీసులు లాఠీఛార్జి చేయడంతో ఆగ్రహించిన సమైక్యవాదులు పోలీసులపై తిరగబడ్డారు. రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. దీంతో పోలీసులు సమైక్యవాదులపై 13 సార్లు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *