సుదీర్ఘ చర్చల తర్వాతే తెలంగాణ

రాత్రికి రాత్రే కాదు : డి. శ్రీనివాస్
హైదరాబాద్, అక్టోబర్ 4 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడొద్దని ఆయన సీమాంధ్రులకు విజ్ఞప్తి చేవారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నేతలు, ప్రజలు సహకరించాలని కోరారు. శుక్రవారం డీఎస్ విూడియాతో మాట్లాడారు. సుదీర్ఘ చర్చల తర్వాతే కాంగ్రెస్ అధిష్టానం విభజన నిర్ణయం తీసుకుందన్నారు. అందరినీ సంప్రదించాకే, అన్ని పార్టీలతో మాట్లాడాకే హైకమాండ్ విభజన ప్రకటన చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ సమస్యను పార్టీ అధినేత్రి సోనియా పూర్తిగా తెలుసుకొని రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించారని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఎన్ని ఒప్పందాలు జరిగినా తెలంగాణకు మొదటి నుంచి అన్యాయం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి ఎన్ని ఒప్పందాలు జరిగినా ఒక ప్రాంతానికి మెజార్టీ ఉన్నందున తెలంగాణకు న్యాయం జరగలేదని వివరించారు. అందుకే తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్టాన్న్రి కోరుతున్నారని చెప్పారు. పార్లమెంట్‌లో బిల్లు పాసయ్యే వరకూ అందరూ సహకరించాలని కోరారు. రెండు ప్రాంతాల వారు విభజనకు అనుకూలంగానే ఉన్నారని చెప్పారు. రాష్టాన్న్రి సమైక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు ప్రయత్నించిందని, కానీ ఫలితం లేకపోవడంతోనే విభజన నిర్ణయం తీసుకుందన్నారు. పార్టీ రోడ్ మ్యాప్ ప్రకారం తెలంగాణ ప్రక్రియ సాఫీగా సాగిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ఉన్న అన్ని స్పీడ్ బ్రేక్‌లు తొలగించారని చెప్పారు. ఆంటోనీ కమిటీ ఆధారంగా నోట్ అని కేంద్రం చెప్పలేదని, సీమాంధ్రకు ఏం చేస్తారో చెప్పనివ్వండని డీఎస్ సూచించారు. తెలంగాణ ఏర్పాటుకు సోనియా గట్టి పట్టుదలతో ఉన్నారని చెప్పారు. తెలంగాణ మినహా మరో మార్గం లేదని రాజీనామాలు చేసిన వారు తన ముందే సోనియాకు చెప్పారని వెల్లడించారు. కానీ, వారే ఇప్పుడు కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. అయితే, వారి పేర్లు బయటపెట్టేందుకు ఆయన నిరాకరించారు.



