ఐదు రాష్ట్రాల్లో కోడ్ కూసింది
మోగిన ఎన్నికల నగారా
ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 11,12
మధ్యప్రదేశ్ నవంబర్ 25
రాజస్థాన్ డిసెంబర్ 1
ఢిల్లీ, మిజోరాంలలో డిసెంబర్ 4న పోలింగ్
ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న
ఈ ఎన్నికల్లో తిరస్కరణకు అవకాశం
కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి వీఎస్ సంపత్
న్యూఢిల్లీ, అక్టోబర్ 4 (జనంసాక్షి) :
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి వీఎస్ సంపత్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలకు తెరలేచింది. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 11 కోట్ల మంది ఓటర్లు ఉన్నారన్నారు. 1,30,000 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఓట్లకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పరిశీలకులను నియమించనున్నామన్నారు. ఓటర్లను చైతన్యపరి చేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ఎన్నికల సంఘం రూపొందించిందని అన్నారు. ఎన్నికల కోడ్ శుక్రవారం నుంచే ఆ ఐదు రాష్ట్రాలలో అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఐదు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు ఒకేసారి జరుగుతుందన్నారు. డిసెంబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, అదే రోజు ఫలితలు వెల్లడవుతాయని చెప్పారు. రాష్ట్రాల వారీగా ఎన్నికల ప్రక్రియ వివరాలు ఇలా ఉన్నాయి. (1) చత్తీస్‌గఢ్ : రెండు దశల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్నది. తొలి దశ ఎన్నికకు నోటిఫికేషన్ అక్టోబర్ 18న విడుదల కానున్నది. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు అక్టోబర్ 25.. పరిశీలన 26.. ఉపసంహరణకు తుది గడువు 28.. పోలింగ్ నవంబర్ 11వ తేదీన జరగనున్నది.
రెండోదశ పోలింగ్ ప్రక్రియ – నోటిఫికేషన్ అక్టోబర్ 25న విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు.. నవంబర్ 1 కాగా, పోలింగ్ నవంబర్ 19న జరగనున్నది.
(2) మధ్యప్రదేశ్ : ఒకేఒక విడతలో ఎన్నిక జరగనున్నది. నోటిఫికేషన్ – నవంబర్ 1 ; నామినేషన్ల స్వీకరణకు తుది గడువు – నవంబర్ 9 ; పరిశీలన – నవంబర్ 10 ; ఉససంహరణకు తుదిగడువు – నవంబర్ 11 ; పోలింగ్ – నవంబర్ 25.
(3) రాజస్థాన్ : నోటిఫికేషన్ – నవంబర్ 5 ; పరిశీలన – నవంబర్ 13 ; ఉససంహరణకు తుదిగడువు – నవంబర్ 16 ; పోలింగ్ – డిసెంబర్ 1వ తేదీ.
(4) న్యూఢిల్లీ : నోటిఫికేషన్ – నవంబర్ 9 ; నామినేషన్ల స్వీకరణకు తుది గడువు – నవంబర్ 16 ; పరిశీలన – నవంబర్ 18 ; ఉససంహరణకు తుదిగడువు – నవంబర్ 20 ; పోలింగ్ – డిసెంబర్ 4వ తేదీన.
(5) మిజోరాం : నోటిఫికేషన్ – నవంబర్ 9 ; నామినేషన్ల స్వీకరణకు తుది గడువు – నవంబర్ 16 ; పరిశీలన – నవంబర్ 18 ; ఉససంహరణకు తుదిగడువు – నవంబర్ 20 ; పోలింగ్ – డిసెంబర్ 4వ తేదీన.




