తెలంగాణ ప్రజాస్వామిక హక్కు


కాదనే హక్కు సీమాంధ్రులకు లేదు : కోదండరామ్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌ 4 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రజాస్వామిక హక్కు అని పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. టీ-నోట్‌కు కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో శుక్రవారం టీ-జేఏసీ నేతలు టీఎన్జీవోభవన్‌లో సమావేశమయ్యారు. అంతకుముందు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణపై క్యాబినెట్‌ నిర్నయంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అధికారికంగా ఆమోదముద్ర పడిందన్నారు. విభజన అనేది తెలంగాణ హక్కు అని.. దాన్ని సీమాంధ్ర నేతలు, ప్రజలు గౌరవించాలని సూచించారు. సమైక్యవాదం అప్రజాస్వామికమని. ఇది ఇతరుల హక్కులకు భంగం కలిగిస్తుందన్నారు.  తెలంగాణ నోట్‌ను ఆమోదిస్తూ కేంద్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కీలక మలుపు తిరిగిందన్నారు. ప్రక్రియను వేగంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ వచ్చే వరకూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణపై తాము కూడా ఒక నోట్‌ను తయారుచేసి మంత్రుల బృందానికి అందజేస్తామన్నారు. హైదరాబాద్‌పై ఎలాంటి మెళికలు పెట్టొద్దని కోరారు.సమైక్యవాదం అనేది అప్రజాస్వామికమని.. అది వైషమ్యాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. సీమాంధ్రలోనూ దళిత, బహుజనులు విభజనను కోరుకుంటున్నారని తెలిపారు. ఈ నెల 6న గుంటూరులో మంద కృష్ణ మాదిగ నిర్వహించ తలపెట్టిన సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో దీక్ష చేపట్టడం తెలంగాణ ప్రజల హక్కులపై దాడేనని విమర్శించారు. ఇంతవరకు వచ్చాక తెలంగాణ విడిపోక తప్పదని, ఇప్పుడు అనవరసంగా సమైక్యం పేరుతో ప్రజలను మోసం చేయొద్దని సూచించారు. అందరికీ రాజ్యాంగం ప్రకారం హక్కులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు దీక్ష అంటే తెలంగాణ ప్రజల విజయంపై దాడి చేయడమేనని వ్యాఖ్యానించారు. విభజనకు వ్యతిరేకంగా జగన్‌ ఆమరణ దీక్ష చేయడం ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్ష విూద జరుగుతున్న దాడి దీక్ష అని అన్నారు. తెలంగాణవాదుల విజయంపై దాడి చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. అనవసరంగా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టవద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రం మనం హక్కు.. సమైక్యవాదమనేది ఒక దాడి అని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ వెనుక ప్రజాస్వామిక కారణమున్నదని, సమైక్య రాష్ట్ర డిమాండ్‌ వెనక అప్రాజస్వామిక కారణమున్నదన్నారు. ఏపీ ఎన్జీవోలు సమ్మె విరమించి ఉద్యోగుల సమస్యలపై పోరాడాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. సమస్యలపై పోరాడితే ఏపీ ఎన్జీవోలతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.