గుజరాత్‌లో అభివృద్ధి డొల్ల

బయటపెట్టిన కాగ్ నివేదిక
ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి పౌష్టికాహార లోపం
అహ్మదాబాద్ :గుజరాత్ ప్రభుత్వంపై కాగ్ (కంప్ట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్) అక్షింతలు వేసింది. గుజరాత్‌లో చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని కాగ్ తప్పుబట్టింది. అక్కడి ప్రభుత్వ లెక్కల ప్రకారం 223.16 లక్షల మంది చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సి ఉంది. అయితే కేవలం 63.37 లక్షల మందికి మాత్రమే పౌష్టికాహారం అందిస్తున్నట్లు కాగ్ పేర్కొంది. గుజరాత్‌లో మొత్తం 75,480 అంగన్‌వాడీ కేంద్రాలు అవసరం కాగా, 52, 137మాత్రమే మంజూరయ్యాయని, అందులో కేవలం 50,225 కేంద్రాలు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయని తెలిపింది. నరేంద్రమోడీి ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్యంపై పూర్తిస్థాయిలో శ్రద్ధ కనబర్చడం లేదని పేర్కొంది. ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని, ఈ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తోందని తెలిపింది. అలాగే చిన్నారుల మృతుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ మోడీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. భావి తరాలపై మోడీ ప్రభుత్వం అలక్ష్యం చేస్తోందని విమర్శించారు. సీపీఐ సీనియర్ నాయకుడు గురుదాస్ గుప్తా మాట్లాడుతూ పేదల పిల్లలపై నిర్లిప్తత తగదన్నారు. పేలమైన భావిభారతాన్ని నరేంద్రమోడీ తయారు చేయదల్చారా అని ఆయన ప్రశ్నించారు.



