Tuesday, 3 November 2026

రాష్ట్రపతి రాగానే అసెంబ్లీకి టీనోట్‌


యూటీ ముచ్చటే లేదు
హైదరాబాద్‌లో సీమాంధ్రులకు భద్రతపై భరోసా
బొత్స ఆస్తుల ధ్వంసంపై దిగ్విజయ్‌ గుస్సా
ఢిల్లీ, అక్టోబర్‌ 6 (జనంసాక్షి) :
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ విదేశీ పర్యటన ముగించుకుని రాగానే అసెంబ్లీకి తెలంగాణ నోట్‌ అందిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ తెలిపారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేసే ముచ్చటే లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రుల భద్రతకు భరోసా ఇస్తామని చెప్పారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందో ళనలపై సీఎం కిరణ్‌ చర్యలు తీసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలని కోరారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. సమైక్య ఉద్యమం పేరిట పీసీసీ ప్రెసిడెంట్‌ బొత్స సత్యనారా యణ ఆస్తులు ధ్వంసం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము శాసనసభను తక్కువ చేసి చూడడం లేదని, తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపినప్పటికీ, తెలంగాణ నోట్‌ తప్పనిసరిగా శాసనసభకు వెళ్తుందన్నారు. రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్సార్సీపీ అధినేత జగన్మో హన్‌రెడ్డిలు దీక్షలు చేపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు అప్పుడు తెలంగాణ నిర్ణయాన్ని స్వాగతించి, కొత్త రాజధాని ఏర్పాటు కోసం రూ.లక్ష కోట్లు నిధులు కూడా కోరారని ఇప్పుడు మాట మార్చి దీక్షకు దిగడం సరికాదని విమర్శించారు. వైసీపీ కూడా తెలంగాణకు అనుకూలమని ప్రకటనలు చేసి ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం జగన్‌ హైదరాబాద్‌లో దీక్ష చేయడం సరికాదని డిగ్గీరాజా వ్యాఖ్యానించారు. విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తిరిగి రాగానే అసెంబ్లీకి తీర్మానాన్ని పంపిస్తామని దిగ్విజయ్‌ తెలిపారు. అసెంబ్లీకి తీర్మానం రాదని అసత్య ప్రచారం చేయడం తగదని ఆయన హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *