బాబు ఎందుకీ దొంగ దీక్ష


విభజనకా.. సమైక్యానికా..
చంద్రబాబు కొంగజపంపై హరీశ్‌ ఫైర్‌
హైదరాబాద్‌ అక్టోబర్‌ 6 (జనంసాక్షి) : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవంగా మండిపడ్డారు. ఢిల్లీలో చేపట్టబోయే దొంగ దీక్ష విభజన కోసమో లేక సమైక్యం కోసమో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. గడ్డితినైనా అధికారంలోకి రావడం బాబు సిద్ధాంతం అన్నారు. ఆనాడు ప్రణబ్‌ ముఖర్జీకి ఇచ్చిన లేఖలో తెలంగాణకు అనుకూలం అని చెప్పింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. రెండు రూపాయల బియ్యంను 5 రూపాయలు చేసింది చంద్రబాబు. ఉచిత విద్యుత్‌ను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు 9 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తానని చెబుతున్నారు. రాష్ట్రంలో బెల్టు షాపులను పరిచయం చేసింది చంద్రబాబు. కిరణ్‌ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే మద్దతు పలికింది చంద్రబాబు అని తీవ్రస్థాయిలో విమర్శించారు. నయవంచనకు  మారుపేరు చంద్రబాబు, అవకాశవాదానికి మారుపేరు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. రోజుకో మాట మాట్లాడటంలో దిట్ట అన్నారు. చంద్రబాబు మాటలు మార్చడాన్ని చూసి ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయన్నారు. వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబు తరువాతే ఎవరైనా అని విమర్శించారు. గులాబీ కండువా కప్పుకొని ఆనాడు చంద్రబాబు తెలంగాణకు మద్దతు పలకలేదా? అని అడిగారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒకప్పుడు కంప్యూటర్‌ వద్ద చంద్రబాబు కూర్చున్న ఫోటో ఉండేదని, ఇప్పుడు నాగలి పట్టిన చంద్రబాబు ఫోటో ఉందని తెలిపారు. నాగలిపట్టిన ఫోటో పెట్టినంత మాత్రాన జనం నమ్ముతారా? అని ప్రశ్నించారు. గతంలో బీజేపీ కారణంగానే ఓడామని ఆరోపణలు చేసిన చంద్రబాబు, ప్రస్తుతం ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఢిల్లీలో వెంపర్లాడుతునన్నాడని ఆరోపించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వ అని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇటీవల మోడీతో ఒకే వేదికను పంచుకొని ఆయనను పొగడ్తలతో ముంచెత్తాడని హరీష్‌ రావు తప్పుపట్టారు.

తాజావార్తలు