తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి కాదు
అభిప్రాయానికే బిల్లు శాసనసభకు..
ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన
కర్నూల్ రాజధాని, గుంటూరు హైకోర్టుపై ప్రతిపాదనలు
హోం మంత్రి షిండే
న్యూఢిల్లీ, అక్టోబర్ 10 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి కాదని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు. తెలంగాణపై తీర్మానంపై ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దానికి తెర దించడానికే మొగ్గు చూపింది. ఈక్రమంలోనే షిండే కుండబద్దలు కొట్టారు. తెలంగాణ తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీకి పంపుతామని కేంద్ర ¬ం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు. తెలంగాణపై మంత్రుల కమిటీ వీలైనంత త్వరలోనే నివేదిక ఇస్తుందని తెలిపారు. ఆయన తన నెలవారీ సమీక్ష నివేదిక విడుదల సందర్భంగా షిండే మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తీర్మానం తప్పకుండా అసెంబ్లీకి వెళ్తుందని తెలిపారు. విభజనపై ఏర్పాటైన మంత్రుల కమిటీ శుక్రవారం సమావేశం కానుందని తెలిపారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. తక్షణమే ఆందోళనలు విరమించాలని సీమాంధ్ర ప్రాంతానికి పూర్తి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ విధివిధానాలపై మంత్రుల బృందానికి విధించిన కాల పరిమితిని తొలగించడంపై ప్రశ్నించగా సాధ్యమైనంత త్వరగా మంత్రుల బృందం తన నివేదిక ఇస్తుందన్నారు. మంత్రుల బృందం అందరి వాదనలు వింటుందని, అందరికీ న్యాంయం చేసేందుకు యత్నిస్తామని తెలిపారు. అయితే, శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెడతారా? అని ప్రశ్నించగా షిండే సమాధానం దాట వేశారు. త్వరలోనే తెలంగాణ నోట్‌ను రాష్ట్ర అసెంబ్లీకి పంపించనున్నట్లు చెప్పారు. కేబినెట్ నోట్ ముందుకు అసెంబ్లీకి వెల్లదని, కేంద్ర మంత్రుల బృందం నివేదికను సమర్పించిన అనంతరం క్యాబినెట్ ఆ నివేదికను ఆమోదించి రాష్ట్రపతికి పంపుతుందన్నారు. రాష్ట్రపతి ఆ నివేదికను అసెంబ్లీకి పంపుతారని స్పష్టం చేశారు. మంత్రుల బృందంలో రాష్ట్రానికి చెందిన మంత్రులు లేరు కదా? అని విలేకరులు ప్రశ్నించగా లేకపోయినా ఇబ్బందేమి ఉండదని చెప్పారు. రాష్ట్రంలోని పరిస్తితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ అందరితో చర్చించందని మంత్రుల బృందం వివిధ వర్గాలతో చర్చిస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేనన్నారు. ఆర్టికల్ 3 ప్రకారమే ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ విడిపోయాక సీమాంధ్ర ప్రాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధానిగా కర్నూల్‌ను ఎంపిక చేయాలని, అలాగే గుంటూర్లో రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు తమకు అందాయని తెలిపారు. వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు.