న్యూఢిల్లీ, అక్టోబర్ 21 (జనంసాక్షి) :
ముస్లిం మైనార్టీల ఆర్థిక స్వయం సమృద్ధి కోసం యూపీఏ ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ప్రస్తుతం 75 దేశాల్లో సత్ఫలితాలిస్తున్న ఇస్లామిక్ బ్యాంకులను ఏర్పాటు చేసి వాటి ద్వారా ముస్లింల స్వయం ఉపాధికి, పరిశ్రమల స్థాపనకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు కసరత్తు మొదలు పెట్టింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరున్నర దశాబ్దాలు గడిచినా ముస్లింలు అభివృద్ధిలో అట్టగున ఉన్నారు. వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడం ద్వారా వెనుకబాటు తనాన్ని రూపుమాపాలనే యూపీఏ సర్కారు ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇస్లామిక్ బ్యాంకులను ఏర్పాటు చేయబోతుంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఇస్లామిక్ బ్యాంకులు తమ సేవలను ప్రారంభించనున్నాయి. ఈ బ్యాంకులు ఇస్లామిక్ ‘షెరియా’ నిబంధనలకు లోబడి పనిచేస్తాయి. స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ముందుకువచ్చే ముస్లింలకు ఈ బ్యాంకులు ఎలాంటి లాభాపేక్ష లేకుండా రుణాలు ఇస్తాయి. ఆర్థికంగా లాభం వచ్చే రంగాల్లో ఇవి పెట్టుబడులు పెట్టిస్తాయి. ఎలాంటి వడ్డీ లేకుండా షెరియా నిబంధనల ప్రకారమే రుణాలందజేస్తాయి. 13వ శతాబ్దంలోనే ఈజిప్టులో పురుడుపోసుకున్న ఇస్లామిక్ బ్యాంకులు తర్వాత ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో ఏర్పాటయ్యాయి. ఇస్లాం ప్రకారం ‘రిబా’ పెట్టుబడికి సమానమైన రొక్కాన్ని మాత్రమే రుణం తీసుకున్న వారు తిరిగి చెల్లించాలి. అంటే వెయ్యి దినార్ల బంగారం రుణంగా ఇస్తే అంతే బరువైన బంగారు కాయిన్లను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మీర్జా బషీర్ ఉద్ దిన్ మహమూద్ అహ్మద్, నమీమ్ సిద్దిఖీ, మహ్మద్ హమీదుల్లా, మహ్మద్ బఖీర్ అల్ సదర్ తమ పుస్తకాలు ఇస్లామ్ కా నిజాం ఇక్ఫిసద్, ఇక్ఫిసదునా (అవర్ ఎకనామిక్స్) ద్వారా ఇస్లామిక్ బ్యాంకుల తీరుతెన్నులను వివరించారు. 13వ శతాబ్దంలో ప్రారంభమైన ఇస్లామిక్ బ్యాంకులు 1960 దశకంలో విస్తరణ బాట పట్టాయి. అనేక దేశాల్లో వాటి సేవలు ప్రారంభమయ్యాయి. ఎలాంటి లాభాపేక్ష లేకుండా 75 దేశాల్లో వడ్డీలేని రుణాలు ఇస్తున్న ఇస్లామిక్ బ్యాంకులు అభివృద్ధిలో మాత్రం ముందంజలో ఉన్నాయి. మానవ వనరులను సమృద్ధిగా వినియోగించుకుంటూ ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతున్న ఇస్లామిక్ బ్యాంకులు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను కుదిపేసిన ఆర్థిక మాంద్యాన్ని సైతం ధైర్యంగా ఎదుర్కొన్నాయి. ప్రపంచ పెట్టుబడిదారి ఆర్థిక విధానాలకు పెట్టింది పేరైన అమెరికా బ్యాంకు మాంద్యం దాటికి విలవిల్లాడితే ఇస్లామిక్ బ్యాంకులు మాత్రం పురోభివృద్ధిలోనే సాగాయి. ఈజిప్టులో 1963లో ప్రారంభమైన మిట్ గర్మ్ ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటుకు దారితీసింది. ఇస్లామిక్ బ్యాంకులు సాలీన పది నుంచి శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధిస్తూ వాణిజ్య బ్యాంకులకు దీటుగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు అనేక కొర్రీలు పెడుతూ వడ్డీలకు చక్రవడ్డీలు జోడించి రుణ గ్రహీతలను పీల్చిపిప్పి చేస్తుంటే ఇస్లామిక్ బ్యాంకులు మాత్రం అడిగిన వారికల్లా రుణాలు ఇస్తూ లాభాపేక్షలేని వ్యాపారంతోనే ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 300కు పైగా ఇస్లామిక్ బ్యాంకులు, 250 మ్యూచువల్ ఫండ్ సంస్థలు సేవలందిస్తున్నాయి. 2005 నాటికి ఈ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా 822 బిలియన్ డాలర్ల వ్యాపారం చేసినట్టు ద ఎకనామిస్ట్ పేర్కొంది. ఈ మొత్తం వ్యాపారం షెరియా నిబంధనలకు లోబడే సాగించినట్లు తేల్చింది. ఇస్లామిక్ బ్యాంకులు 2012 నాటికి 1.10 లక్షల కోట్ల ఆదాయం ఆర్జించినట్లుగా అంతర్జాతీయ ఆర్థిక సర్వేలు వెల్లడించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక తిరోగమన పరిస్థితులన్నా ఇస్లామిక్ బ్యాంకులు 2014 నాటికి అవి మరింత పురోగమనంలోకి వెళ్తాయని అవి పేర్కొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యానికి తట్టుకొని నిలబడిన ఇస్లామిక్ బ్యాంకులను మన దేశంలోనూ ప్రవేశపెట్టి ముస్లింల ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని కేంద్రం వ్యూహాలు రచిస్తోంది. అలాగే దేశంలో మత కలహాల నియంత్రణకు ప్రత్యేకంగా బిల్లు తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది.
భారత్లో ఇక ఇస్లామిక్ బ్యాంకింగ్





