మన చరిత్రపై మట్టికప్పుతున్నరు


వలస పాలకులు ఎక్కడైనా ఇలాగే చేస్తారు
సీమాంధ్రుల చెప్పుచేతల్లో సినీ పరిశ్రమ
పైడి జయరాజ్‌పై జనంసాక్షి కథనం
స్పందించిన తెలంగాణ చిత్ర పరిశ్రమ
హైదరాబాద్‌, అక్టోబర్‌ 23 (జనంసాక్షి) :
బాలీవుడ్‌లో తొలి తెలుగు హీరో.. కరీంనగర్‌ ముద్దుబిడ్డ పైడి జయరాజ్‌ చరిత్రను మరుగుపరుస్తున్నారని తెలంగాణకు చెందిన ప్రముఖ సినీ దర్శ కులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాసాహెబ్‌ ఫాల్కే అంతటి ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తొలి తెలుగువాడిగా ఖ్యాతిగాంచిన జయరాజ్‌కు ఆ స్థాయి గౌరవం దక్కడం లేదని వారు పేర్కొంటున్నారు. ఎంతసేపు తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరిని స్తుతించడం, కీర్తించడంతోనే సీమాంధ్ర మీడ ియా కాలక్షేపం చేస్తుందే తప్ప జయరాజ్‌లాంటి దిగ్గజాల చరిత్రను మాత్రం వెలుగులోకి తేవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌కు తెలుగు చలనచిత్ర పరిశ్రమ వలస వచ్చినప్పటికీ ఆధిపత్యం మాత్రం సీమాంధ్రులదేనని, వారి చరిత్రే తెలుగు సినిమా చరిత్రగా మనుగడలో ఉందని పేర్కొన్నారు. రాబోయే తెలంగాణ రాష్ట్రంలోనైనా ఈ ప్రాంతానికి చెందిన జయరాజ్‌లాంటి దిగ్గజాల చరిత్రను అందరికీ తెలిసేలా చేయాలని వారు కోరుతున్నారు. జయరాజ్‌ చరిత్రను తెలంగాణ ప్రజానీకానికి చాటిచెప్పే ప్రయత్నం చేసిన ‘జనంసాక్షి’కి వారు కృతజ్ఞతలు తెలిపారు.
జయరాజ్‌కు దక్కాల్సిన గౌరవం దక్కలేదు
– శంకర్‌, ప్రముఖ దర్శకుడు
దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్న మొటమొట్టది తెలుగువాడిగా పైడి జయరాజ్‌కు దక్కాల్సిన గౌరవం ఇంకా చాలా ఉంది. వందేళ్ల సినిమా వేడుక వేదికపై ఆయన పేరు మాత్రమే చదివి వదిలేశారు. ఆయన ఘనతను ఎక్కడా ప్రస్తావించలేదు. ఇది విచారకరం. సినిమా పరిశ్రమ, కళా ప్రియులు కూడా జయరాజ్‌ ఘనతను, కీర్తిని భవిష్యత్‌ తరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. దానిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం, ఆయన చరిత్రను తెలుగు ప్రజలందరికీ చాటిచెప్పి ఆయనను అందరూ గౌరవించేలా చర్యలు తీసుకోవాలి.
మనవాళ్ల చరిత్రను మనమే వెలుగులోకి తేవాలి
– రఫీ, సినీ దర్శకుడు, నటుడు
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ సినిమా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌
పైడి జయరాజ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వచ్చి ఇంతకాలమైంది. మాలాంటి వాళ్లకు కూడా ఈ విషయం ఇప్పుడే తెలిసింది. ఇలాగే ఇంకెంత మంది దిగ్గజాలు, ఆణిముత్యాల చరిత్ర పాతర పెట్టేయబడిందో తెలియదు. ఇలాంటి వ్యక్తి గురించి చరిత్ర గురించి, సినిమాల గురించి పరిశోధనాత్మక కథనం ద్వారా తెలియజేసిన ‘జనంసాక్షి’కి అభినందనలు. అప్పట్నుంచి ఇప్పటి వరకు నైజాం స్టేట్‌ కావచ్చు, తెలంగాణ గురించి మన చరిత్ర మనకు తెలియడం లేదు. చరిత్రను రాసిన వాళ్లు మనవాళ్లు కాదు కాబట్టి వాళ్లు రాసిన చరిత్రనే చెలామణీ చేశారు. ఒకవేళ మనవాళ్లలో ఎవరి చరిత్రనైనా వెలుగులోకి తీసుకువచ్చిన అది వక్రీకరించినది మాత్రమే. పాత్రికేయులు, మేధావులు, కళాకారులు ఇప్పటికైనా తెలంగాణ చరిత్రను తవ్వి వెలికి తీసి దానిని కాపాడే ప్రయత్నం చేయాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చినా సీమాంధ్రుల ఆధిపత్యం వల్లనే ఇక్కడ భూములు, స్టూడియోలు, చరిత్ర అన్ని వాళ్లయే ఫోకస్‌ చేసుకుంటున్నారు. జయరాజ్‌ చరిత్ర తెలుగు సినిమా పరిశ్రమ వాళ్లకు తెలియదు అనుకోవడానికి లేదు.. తెలిసి కూడా ఆయన చరిత్రను దాచడం దుర్మార్గం. మన వాళ్లను వెలుగులోకి తేలేదు అని ఆవేదన చెందేకంటే మనవాళ్ల చరిత్రను మనమే చెప్పుకునే స్థాయికి ఎదగాలి. ఆయన చరిత్రనే కాదు మొత్తం తెలంగాణ చరిత్రనే పాతేరాయడం దుర్మార్గం. తెలంగాణ వాళ్లు ఆధిపత్యం చేసే స్థాయికి చేరుకుంటే తప్ప మన చరిత్రను పదుగురికి చెప్పడం సాధ్యం కాదు. మన వాళ్లను, మన చరిత్రను మనమే వెలుగులోకి తీసుకురావాలి. లెజెండ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీని వెలుగులోకి తీసుకురావడం పట్ల తెలంగాణ సినిమా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రధాన కార్యదర్శిగా ‘జనంసాక్షి’ పత్రికను అభినందిస్తున్నా. ఇకనైనా మనమే ఆధిపత్యంలోకి వచ్చి మన చరిత్రను పరిరక్షించుకుందాం.
తెలంగాణపై తరతరాల వివక్షకు సాక్ష్యం.. జయరాజ్‌
– డాక్టర్‌ ఎల్‌. శ్రీనాథ్‌
ఉపాధ్యక్షులు, తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం
భారత చలన చిత్రరంగంలో విశేష కృషి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు. ఇంత గొప్ప గౌరవాన్ని అందుకున్న మొట్టమొటది తెలుగువాడు పైడి జయరాజ్‌ మన తెలంగాణ బిడ్డ కావడం మన అదృష్టం. ఆయన దురదృష్టం. ఏ ఉత్సవాల్లోనూ, వేడుకల్లోనూ ఆయన గురించి మాట్లాడటంకానీ, స్మరించుకోవడం కాని, ఫాల్కే అవార్డు గ్రహీత జయరాజ్‌ అనే ఒక మహనీయుడు ఉన్నారని, ఆయన మన తెలుగువాడే అని గుర్తు చేసుకున్న సందర్భాలు కూడా లేవు. ఇది దారుణం. తెలంగాణ కళాకారుల పట్ల, మహనీయుల పట్ల తరతరాలుగా జరుగుతున్న వివక్షకు ఇది సజీవ సాక్ష్యం. సినిమా పరిశ్రమలో తెలంగాణవాళ్లు నిలదొక్కుకోలేరు అనే భావజాలాన్ని దశాబ్దాలుగా వ్యాప్తి చేయడం వల్ల నిజంగానే సినీరంగంలో మనం మనలేమేమో అనే భావనలోనే ఇక్కడివాళ్లు ఉన్నారు. ఒకవేళ పైడి జయరాజ్‌ అనే తెలంగాణ బిడ్డ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు తీసుకున్నరనే దానికి తగిన ప్రచారం జరిగి ఉంటే తెలంగాణ నుంచి ఇంకెందరో జయరాజ్‌లు పుట్టేవాళ్లు. ఇప్పటికైనా ఇలాంటి వివక్షకు తెరదించాలి. రాబోయే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ చిత్ర పరిశ్రమకు మట్టి పరిమళం అద్దాలంటే సినీరంగం పట్ల మనవాళ్లకు ఉన్న అపోహలను దూరం చేసి ప్రజలకు మంచి చేసే సినిమాలకు తీసే వాతావరణాన్ని కల్పించి తెలంగాణ సినిమాను సుసపన్నం చేయాలి. అదే జయరాజ్‌ గారికి అసలైన నివాళి.