
సీమాంధ్రుల సమస్యలను జీవోఎం పరిష్కరిస్తుంది
– ప్రధాని మన్మోహన్‌సింగ్
న్యూఢిల్లీ, అక్టోబర్ 24 (జనంసాక్షి) :
చట్టానికి తాను అతీతుడిని కానని, బొగ్గు కుంభకోణంలో సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నానని ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ చెప్పారు. గురువారం న్యూఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బొగ్గు గనుల కేటాయింపులో దాచాల్సిందేమీ లేదన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు తనకు తెలుసని, అయినా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తెలం గాణ విభజనకు సంబంధించిన సమస్యలను గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) పరిష్కరిస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా ఆయన పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లం ఘనపై ఆయన వివరణ సంతృప్తికరంగా లేదన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి రక్షణ కల్పిస్తామని ప్రధాని తెలిపారు. బొగ్గుగనుల కేటాయిం పులపై ప్రధానిని కూడా ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న విషయం విదితమే. గనుల కేటాయింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ కూడా ప్రధాని మన్మోహన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గనుల కేటాయింపులో కుట్ర జరిగిందని సీబీఐ భావిస్తే.. తుది నిర్ణయం తీసుకున్న ప్రధాని కూడా కుట్ర దారేనని ఆయన అన్నారు. శాఖను నిర్వహించిన మన్మోహన్‌నూ దోషిగా పరిగణించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
బొగ్గు స్కాంలో సీబీఐ విచారణకు సిద్ధం




