శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు
అంతకంటే ముందే జీవోఎం నివేదిక
నిర్ణీత గడువులోనే ప్రక్రియ పూర్తి
బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన వెంటనే కొత్త రాష్ట్రం
కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే
పంపకాలపై హోంశాఖ కీలక సమావేశం
న్యూఢిల్లీ, అక్టోబర్ 25 (జనంసాక్షి) :
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను పూర్తి చేస్తామని కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్ షిండే వెల్లడించారు. శుక్రవారం ఆయన పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల కన్నా ముందే తెలంగాణపై ఏర్పాటైన మంత్రుల బృందం (జీఓఎం) క్యాబినెట్‌కు నివేదిక అందజేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటులో ఉన్న సంక్లిష్టతలను మంత్రుల బృందం పరిశీలిస్తోందని ప్రధాని మన్మోహన్సింగ్ చెప్పిన 24 గంటల్లోనే షిండే ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘ఆ అంశం (తెలంగాణ) ప్రస్తుతం మంత్రుల బృందం పరిశీలన ఉంది. విభజన వల్ల వచ్చే సమస్యలు, అన్ని అంశాలను అది పరిశీలిస్తుంది. సమగ్ర పరిష్కారాలను చూపిస్తుందన్న నమ్మకం ఉంది’ అని ప్రధాని గురువారం తెలిపారు. 2014 ఎన్నికల లోపే తెలంగాణ రాష్ట్రం వాస్తవరూపంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం పీటీఐతో మాట్లాడిన షిండే.. ఇదే అంశాన్ని సూచనాప్రాయంగా తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోపే మంత్రుల బృందం నివేదిక సమర్పిస్తుందని చెప్పారు. డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే, రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్ర ¬ం శాఖ శుక్రవారం కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర ¬ం శాఖ కార్యదర్శి గోస్వామి నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. విభజన ప్రక్రియలో అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించారు. నిధులు, నీళ్లు, వనరులు, ఆదాయం-అప్పుల పంపిణీ, హైదరాబాద్, ఉద్యోగుల విభజన వంటి అంశాలపై కులంకుషంగా చర్చించినట్లు సమాచారం.