Tuesday, 3 November 2026

వరదలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష


మృతుల కుటుంబాలకు పరిహారం
హైదరాబాద్‌, అక్టోబర్‌ 26 (జనంసాక్షి) : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, సహాయక చర్యలపై శనివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు మహీధర్‌రెడ్డి, పార్థసారథి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, డీజీపీ ప్రసాదరావు తదితరులు హాజరయ్యారు. అలాగే, గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న మంత్రుల బృందానికి ఫోన్‌ అక్కడి వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకొనేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగించాలన్నారు. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వీలైనంత త్వరగా రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలన్నారు. రోడ్లు, చెరువులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. చనిపోయిన కుటుంబాలకు నష్ట పరిహారం చూపించాలని ఆదేశించారు. వరద ముంపు బాధితులకు ఆహారం పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే మరిన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలను పంపించాలని కేంద్రాన్ని కోరాలని సూచించారు. అలాగే, వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించాలని కిరణ్‌ నిర్ణయించారు. ఈమేరకు ఒకటి, రెండ్రోజుల్లో ఆయన పర్యటన షెడ్యూల్‌ ఖరారు కానుంది. ఆయన పర్యటన కేవలం సీమాంధ్రకే పరిమితయ్యే అవకాశమున్నట్లు సమాచారం. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. శనివారం గుంటూరు జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో మంత్రుల బృందం పర్యటించింది. రఘువీరారెడ్డితో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి టీజీ వెంకటేశ్‌, కాసు కృష్ణారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తదితరులు భారీ వర్షం నష్టాలను పరిశీలించారు. నాలుగు రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భభంగా తమను ఆదుకోవాలని రైతులు మంత్రుల బృందాన్ని నిలదీశారు. తప్పకుండా ఆదుకుంటామని రఘువీరా హావిూ ఇచ్చారు. పంటలు నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *