
ముందస్తు చర్యలపై నివేదిక
బాధిత ప్రాంతాల్లో శాటిలైట్ ఫోన్లు వాడాలి
విపత్తు నివారణ సమావేశంలో ప్రధాని
న్యూఢిల్లీ, అక్టోబర్ 28 (జనంసాక్షి) :
ప్రకృతి విపత్తులు సంభవించినపుడు వాటిల్లిన నష్టాన్ని బీమా సంస్థల ద్వారా చెల్లిస్తామని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ తెలిపారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించిచారు. ఇటీవల సంభవించిన విపత్తుల సమయంలో తీసుకున్న ముందస్తు చర్యలపై సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, విపత్తుల సమయంలో సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభిస్తున్న దృష్ట్యా సహాయక చర్యల కోసం, సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకు శాటిలైట్ ఫోన్లు వాడుతున్నామని తెలిపారు. విపత్తుల నిర్వహణకు వివిధ శాఖల బడ్జెట్‌లో కొంత కేటాయించాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రకృత్తి విపత్తులపై ఎర్త్ సైన్సెస్ విభాగం నేతృత్వంలోని కమిటీ ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి నివేదికలు అందిస్తుందన్నారు. విపత్తుల సమయంలో ఓకే నంబర్‌తో అత్యవసర హెల్ప్‌లైన్ ఏర్పాటుపై హోం మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టిందని తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాగం సన్నద్ధంగా ఉంటుందని, అవసరమైతే సైన్యం సేవలను ఉపయోగించుకొని ప్రాణనష్టం సంభవించకుండా చూస్తామన్నారు.
విపత్తు నష్టం బీమా సంస్థల ద్వారా చెల్లింపు




